కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే సంగతి తెలిసిందే. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పార్టీలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని గుర్తించడం కష్టమే. దీన్ని గమనించిన రేవంత్ ప్రతి ఒక్కరిని కలిసి విమర్శకుల నోళ్లకు తాళం వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. పార్టీని గెలిపించే వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి ఇతర పార్టీల్లో చేరిన వారి కోసం న్యాయపోరాటం మొదలుపెట్టారు. ప్రజాకోర్టులో నిలదీసేందుకు సమాయత్తమవుతున్నారు. కాంగ్రెస్ ను సామాజిక వర్గాల వారీగా బలోపేతం చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉంటూ ఒకింత స్తబ్దుగా ఉన్న నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
రాష్ర్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే పనిలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను కలుస్తూ వారిని పార్టీకి రావాలని కోరుతున్నారు. దీంతో ఇన్నాళ్లు పార్టీకి దూరంగా ఉంటున్న వారిలో ధైర్యాన్ని నింపే పని కూడా తన భుజాన వేసుకున్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి సేవలు పార్టీకి అందేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాక పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని అందరు భావిస్తున్నారు.