Retired MPDO Ramakrishnaiah: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసుల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహించే పోలీసులతోపాటు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని సీపీ రంగనాథ్ వదిలిపెట్టడం లేదు. తప్పు చేశాడని నిరూపణ అయితే విధుల నుంచి తప్పిస్తున్నారు. ఈ ఏడాదిలో జనవరిలో ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. సీఐ, మహిళా ఎస్సై వ్యవహరాంలో ముగ్గురు పోలీసులపై వేటు వేశారు. కేయూసీ ఇన్‌స్పెక్టర్ భూ సెటిల్‌మెంట్లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడన్న ఫిర్యాదుతో ఆయనను విధులనుంచి తొలగించారు. తాజాగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జనగామ జిల్లా బచ్చన్నపేట ఎస్సై నవీన్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ సీపీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విధి నిర్వహణలో ఇన్నాళ్లు కాసులే కర్తవ్యంగా వ్యవహరించిన కొందరు పోలీసు అధికారులు, సిబ్బందికి ఇప్పుడు గుబులు పట్టుకుంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కలవరం మొదలైంది. తమపైనా వేటు పడేనా.. అనే ఆందోళన వారిని వెంటాడుతున్నది.
రిటైర్డ్ ఎంపీడీవో హత్య విషయంలో నిర్లక్ష్యం..
బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హత్య కేసు విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు నవీన్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. రామకృష్ణయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. నలుగురు సుపారీ గ్యాంగు సభ్యులు రామకృష్ణయ్యను హత్యచేసి జనగామ సమీపంలోని చంపక్‌హిల్స్ ప్రాంతంలో ఓ గుంతలో పడేసి వెళ్లారు. ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే రామకృష్ణయ్య బతికి ఉండేవాడని కుటుంబ సభ్యులు అంటున్నారు.
అనుమానితుడి వివరాలు చెప్పినా..
జనగామ జడ్పీ వైస్‌చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి భర్త అంజయ్య సుపారీ హత్యలు చేస్తున్నట్టు మృతుడి కుటుంబ సభ్యులు అనుమానంతో ముందస్తుగా పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు విషయాన్ని పెడచెవిన పెట్టారు. సుభద్ర అనే సమీప బంధువును కూడా సుపారీ గ్యాంగుతో అంజయ్య హత్య చేయించినట్లు విచారణలో తేలింది. అప్పుడు కూడా బాధితురాలి కుటుంబ సభ్యులు బచ్చన్నపేట పోలీసుకు ఫిర్యాదు చేయగా కేసును దర్యాప్తు చేయకుండా 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు.
నిఘా విభాగం సమాచారంతో..
ఈ ఘటనతో ఎస్సై నవీన్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలకు సీపీ రంగనాథ్ నిఘా విభాగం అధికారులతో సమాచారం సేకరించారు. నవీన్‌కుమార్ తప్పు చేసినట్టు దర్యాప్తులో తేలడంతో విధుల నుంచి తొలగిస్తున్నట్టు సీపీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనగామ డివిజ¯Œ పరిధిలోని కొందరు పోలీసు అధికారులు, సిబ్బందిపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. కొద్ది రోజుల్లో మరో ఇద్దరిపై వేటుపడే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సస్పెన్షన్ల కలకలం
కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సస్పెన్షన్ల పర్వం పోలీసుశాఖలో కలకలం రేపింది. ప్రస్తుతం జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతోంది. మునుపెన్నడూ లేని రీతిలో డీసీపీ స్థాయి అధికారి విచారణ చేస్తున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని సీపీ సంకేతాలు ఇస్తున్నారు.