BC 1 Lakh Scheme: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ సంక్షేమ పథకాల అమలులో వేగాన్ని పెంచింది. మొన్నటికి మొన్న గృహలక్ష్మి పథకంలో భాగంగా సొంత ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాదిమంది నిరుపేద బీసీలకు ఆర్థిక సాయం అందనుంది.
తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోను ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) మూడో ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలకు పదును పెట్టారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే బీసీలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.
లక్ష రూపాయల ఆర్థిక సాయం వారికి..
బీసీ వర్గాలకు ఆర్థికంగా చేయూతను అందించే ఉద్దేశంతో తెలంగాణ సర్కార్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా బీసీ వర్గాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ పథకానికి ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వెబ్సైట్ తోపాటు పంచాయతీ కార్యాలయాల్లోనూ ఉంచాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ప్రతి నెల 15న సాయం అందించేలా..
ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందించే సాయాన్ని ప్రతినెలా 15వ తేదీన ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంపికైన వారికి వరుస క్రమంలో ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ సొమ్ముతో లబ్ధిదారులు పరికరాలు కొనుగోలు చేశాక నెల రోజుల్లో పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ లక్ష రూపాయలు ద్వారా ఆయా బీసీ కులాలకు చెందిన లబ్ధిదారులు స్వయం ఉపాధిని పొందేందుకు అనుగుణమైనటువంటి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు, ఇతర సామాగ్రిని లబ్ధిదారులే నేరుగా కొనుగోలు చేయవచ్చు. అయితే సాయాన్ని అందించిన నెల రోజుల్లో అధికారులు ఆయా లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి కొనుగోలు చేసిన పరికరాలను పరిశీలించి వాటిని ఓకే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా బీసీ వర్గాలు స్వయం ఉపాధిని పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించబోతోంది.