కరోనా విషయంలో భయపడిందే జరగబోతోందా? చిత్ర పరిశ్రమకు మరోసారి భారీ దెబ్బ తగలబోతోందా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడం.. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతుండడంతో.. మళ్లీ థియేటర్లపై ఆంక్షలు విధించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. అతి త్వరలోనే నిర్ణయాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.
సెకండ్ వేవ్ విజృంభణతో ఇప్పటికే రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కఠిన మార్గదర్శకాలు జారీచేశాయి. ఇక, పలు రాష్ట్రాతై లాక్ డౌన్ నిర్ణయాలు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ముంబై వీకెండ్ లాక్ డౌన్ ప్రకటించింది. థియేటర్లు, షాపింగ్ మాల్స్ పై కఠిన ఆంక్షలు విధించింది. మిగిలిన కొన్ని రాష్ట్రాలు కూడా రాత్రిపూట కర్ఫ్యూ విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంక్షలు విధించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో లాక్ డౌన్ ఆలోచనే లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ.. మారుతున్న పరిస్థితుల ప్రకారం.. నిర్ణయాలు కూడా మారే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ నుంచి 30 వరకు థియేటర్లపై ఆంక్షలు విధించే ఛాన్స్ ఉందని అంటున్నారు. పాత పద్ధతిలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లను కొనసాగించాలని ఆదేశించే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో.. వకీల్ సాబ్ తర్వాత రాబోయే చిత్రాలన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. నెక్స్ట్ వీక్ రాబోతన్న లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే వాయిదా పడింది. ఆ తర్వాత రావాల్సిన టక్ జగదీష్, ఆచార్య, పుష్పతోపాటు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు కూడా వాయిదా పడనున్నట్టు సమాచారం. కరోనా కండీషన్ ను బట్టి తదుపరి రిలీజ్ డేట్లను ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఇండస్ట్రీకి ఇది పిడుగు లాంటి వార్తే అని చెప్పడంలో సందేహమే లేదు.