విశాఖ ఉక్కు పరిశ్రమను వంద శాతం ప్రైవేటీకరణ చేసుడే అని కేంద్రం చెప్పడంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే కేంద్రం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ప్రైవేటీకరణకు ఏ ప్రైవేటు సంస్థ ముందుకు రాని నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌ను మూసివేస్తామంటూ బెదిరింపులకు సైతం దిగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం కోసం జగన్ రంగంలోకి దిగాలని, అది సీఎంగా జగన్ నైతిక బాధ్యత అని చంద్రబాబు జగన్‌ను ఇరకాటంలోకి నెడుతున్నారు.
Also Read: ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఆమే అంబాసిడర్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వెంటనే పదవికి రాజీనామా చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. మాయమాటలతో ప్రజల్ని మోసం చేయకుండా, ఇప్పటికైనా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిని కలవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా ప్రయత్నం చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 6వ తేదీన మొదటి లేఖ రాశారని, అప్పటి నుంచి ఇప్పటివరకు వైసీపీకి చెందిన 28 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
పోస్కో ప్రతినిధులతో మాట్లాడి తనకు ఏం తెలియదన్నట్టు అబద్ధం ఆడారని చంద్రబాబు మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి అంగీకరించి ఏపీకి వచ్చి మాట మార్చారని ఆక్షేపించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయించటం ఖాయం, రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పగా జగన్ నిజస్వరూపం ఏపీ ప్రజలకు అర్థమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే మరోసారి ప్రధానికి లేఖ రాసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
Also Read: హిందూ నినాదం.. కవితకు వర్కౌట్ అవుతుందా..?
గతంలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీపై అదే తరహా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందరితో రాజీనామాలు చేయించి కేంద్రంపై పోరాటం సాగించాలని సీఎం జగన్ కు చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న చంద్రబాబు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్