
మరో సంచలన నివేదిక దేశ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పుడొచ్చిన కరోనా సెకండ్ వేవ్ ఆదిలోనే ఉందని.. దాని తీవ్ర రూపం మే 15 వరకు ఇంకా భయంకరంగా ఉంటుందని తేలింది. కేంద్రఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం రాబోయే రోజుల్లో దేశం కరోనా విలయంతో అల్లకల్లోలం అవుతుందని తేలింది.
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. రోజువారీ కొత్త కేసుల్లో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
దేశంలో ఇప్పుడు కరోనా కేసులు జెట్ స్పీడుగా నమోదవుతున్నాయి. కొత్తగా 3.32 లక్షల కేసులు.. 2,263 మరణాలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ విలయానికి తోడు ఆక్సిజన్ కొరత అందరినీ మరింత ఆందోళనకు గురిచేస్తోంది. మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తారేమోనన్న ఆందోళన ప్రస్తుతం నెలకొంది.
అయితే ఏప్రిల్ లోనే ఇలా ఉంటే మే నెల వరకు దేశంలో కరోనా విలయం సంభవిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో మరో మూడు వారాల తర్వాత పతాక స్థాయికి కరోనా సెకండ్ వేవ్ చేరుకుంటుందని ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధనలతో తేలింది. ఈ మేరకు వారు రిపోర్టు బయటపెట్టారు.
కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు కేంద్రానికి సమర్పించిన నివేదిక ప్రకారం.. మే 11-15వ తేదీల మధ్య వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయని.. అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33లక్షల నుంచి 35లక్షల వరకు పెరుగుతాయని వారు పేర్కొన్నారు.
ఇక ఏప్రిల్ 25-30వ తేదీల మధ్యన ముఖ్యంగా తెలంగాణ, ఢిల్లీ, రాజస్తాన్, హర్యానా రాష్ట్రాల్లో కొత్త కేసులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక మరో ఊరట కలిగించే అంశం ఏంటంటే మే నెలాఖరు కల్ల కేసులు బాగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మే 15కు పతాక స్థాయికి చేరి నెల చివరన కేసులు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని కాన్పూర్ ఐఐటీ శాస్ర్తవేత్తలు తెలిపారు.
కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తల బృందం ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్యలోగా కరోనా సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తుందని అంచనావేసింది. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తాయని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా విధించే అవకాశాలు ఉన్నాయని అంచనావేసింది.