YS Jagan: అక్రమ ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ కు స్వల్ప ఊరట లభించింది. ఆయనపై ఉన్న సీబీఐ అభియోగాలపై సమగ్ర విచారణ పూర్తయితేనే..ఈడీ కేసుల విచారణ చేపట్టి తీర్పును వెల్లడించాలని ..అంతవరకూ వాటి జోలికి పోవద్దని తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా జోరు మీద ఉన్న ఈడీ అధికారాలకు కోత విధించినట్టయ్యింది. దీంతో జగన్ లా అక్రమ ఆస్తుల కేసుల విచారణను ఎదుర్కొంటున్న నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఇది ఊరటనిచ్చిన విషయం. సీబీఐ కేసులు నమోదుకాగానే ఈడీ రంగంలోకి దిగేది. ఆస్తులను అటాచ్ మెంట్ చేయడంతో పాటు అరెస్ట్ ల పర్వం కొనసాగించేది. అటు సీబీఐ కేసులతో సంబంధం లేకుండా తమ కేసుల విచారణను ప్రారంభించాలని ఈడీ సీబీఐ కోర్టును గతంలో ఒకసారి అభ్యర్థించింది. క్విడ్ ప్రోకో కు సంబంధించి మాత్రమే సీబీఐ కేసులు నమోదుచేస్తోందని..ఈడీ మాత్రం అక్రమంగా నగదు చెలామణి చేశారని కేసు నమోదుచేసిందని.. రెండింటికీ తేడా ఉందన్న విషయాన్ని కోర్టు ముందు ఉంచింది. దీంతో ఏకీభవించిన కోర్టు సీబీఐతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణను చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇన్నాళ్లకు సీబీఐ కోర్టు ఆదేశాలకు బ్రేక్ వేస్తూ తెలంగాణ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ….
ఈడీకి సంపూర్ణ అధికారాలున్నాయని.. కేసులు నమోదుతో పాటు అరెస్టులు కూడా చేసుకోవచ్చని గతంలో కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనిపై చాలామంది భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఆస్తుల కోసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ విషయంలో సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ..ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్ష్, భారతీ సిమెంట్స్ వేర్వేరుగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలుపరిచాయి. దీంతో పిటీషన్ తరుపు న్యాయవాదుల వాదన విన్న తెలంగాణ హై కోర్టు వారి వాదనతో ఏకీభవించింది. ఈడీ వాదనను తిరస్కరించింది. జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో మొదట సీబీఐ చార్జిషీట్లపై తేల్చాలని..ఒక వేళ ఆ కేసులు వీగిపోతే ఈడీ కేసులు కూడా నిలబడవన్న విషయాన్ని ప్రస్తావించింది. సీబీఐ కేసులు తేలేవరకూ ఈడీ కేసుల జోలికి పోవద్దని.. ఎటువంటి తీర్పులు కూడా వెలువరించకూడదని ఉత్తర్వులు జారీచేసింది. సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సైతం హైకోర్టు కొట్టివేసింది.జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి 11 సీబీఐ, 9 ఈడీ చార్జిషీట్లపై హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈడీకి గట్టి ఝలక్,…
తాజాగా జగన్ కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈడీకి ఝలక్ తగిలింది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈడీ మంచి దూకుడు మీద ఉంది. తమకు నచ్చని నేతలపై కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగిస్తుందన్న అభియోగం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. వాస్తవానికి ఈడీ నేరుగా కేసులు నమోదు చేయలేదు. సీబీఐ లేదా ఐటీ అధికారులు కేసులు నమోదుచేసే సమయంలో మనీ లాండరింగ్ బయటపడితేనే ఈడీ ఎంటరవుతుంది. కేసులు నమోదుచేస్తుంది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా ఇదే జరిగింది. తొలుత సీబీఐ కేసులు నమోదుచేసింది.తరువాతే ఈడీ ప్రవేశించగలిగింది. అయితే తాజా హైకోర్టు తీర్పుతో సీబీఐ విచారణ పూర్తయితే కానీ ఈడీ విచారణ చేపట్టకూడదు. ఏపీ సీఎం జగన్ ఈడీ బాధిత నేతలకు ఒక విధంగా ఒడ్డున పడేశారని చెప్పవచ్చు.