
తెలంగాణలో ప్రస్తుతం లాక్ డౌన్4.0 మే 29 వరకు అమలుకానుంది. కానీ దేశ వ్యాప్త లాక్ డౌన్3.0 ఈ నెల 17తో ముగియనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వమిచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు కాబట్టి అందుకనుగుణంగా వ్యూహం అనుసరించక తప్పదని చెప్పారు.
సీఎం కరోనాపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో హైదరాబాద్ పరిధిలోని ఎల్.బి.నగర్, మలక్‌పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ జోన్లలో 1,442 కుటుంబాల్లోనే వైరస్ ఉంది. యాదాద్రిభువనగిరి, జనగామ, మంచిర్యాల జిల్లాలకు చెందిన కొందరు వలస కూలీలకు వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసులెవరికీ పాజిటివ్ లేదు. హైదరాబాద్ లోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ఎక్కడా కరోనా చికిత్స పొందుతున్న వారి కేసులు లేవని తెలిపారు. ఒకవేళ ఉన్నా.. వారు కూడా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ కేసులున్న నాలుగు కంటెయిన్‌మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు.
గ్రామాలు, పట్టణాలు, నగరాలకు నిధులు
లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా గ్రామాలు, పట్టణాలు, నగరాలలో పారిశుద్ధ్య, ఇతర అత్యవసర పనులు చేయడానికి నిధుల కొరత లేకుండా చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన నిధులను ఇప్పటికే ఇచ్చాం. జూన్ కు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించాం’ అని సీఎం చెప్పారు.