
Registration Fee In Telangana: కరోనా కల్లోలం వేళ ఆదాయం పెంచడానికి ప్రభుత్వానికి పెంచడం తప్ప తగ్గించడం అన్న మాట వినిపించడం లేదు. ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచేసింది. ఇప్పుడు కేసీఆర్ సర్కార్ కూడా అదే పనిచేసింది. అత్యధిక ఆదాయం గల వారిపై పడింది.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఫీజులతోపాటు వినియోగచార్జీలు, రెవెన్యూ శాఖ ద్వారా అందించే వివిధ సేవల రుసుములను ప్రభుత్వం పెంచింది. ఇక సొసైటీల రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు , చిట్ ఫండ్ లకు సంబంధించిన చార్జీలను పెంచింది. పెరిగిన రుసుములు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది.
ఇటీవలే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, స్టాంపు డ్యూటీని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కూడా అందించే వివిధ సేవల ఫీజులను భారీగా పెంచింది.
ఇక రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులంటే ఎవరో వివరించింది. గతంలో సొసైటీ రిజిస్ట్రేషన్ చార్జి రూ.500 ఉండగా.. తాజాగా ఇది రూ.2వేలకు పెంచింది. సొసైటీల డాక్యుమెంట్ల ఫైలింగ్ కు రూ.400 ఉన్న మొత్తాన్ని ఏకంగా రూ.1000కు పెంచింది.
అగ్రిమెంట్ సేల్, జీపీఏలకు గతంలో రూ.2వేలు ఉండగా.. తాజాగా దీనికి కనిష్టం రూ.5000 గా గరిష్టంగా లక్ష రూపాయలు నిర్ణయించారు. ఇంటివద్ద రిజిస్ట్రేషన్ చేసే రుసుం గతంలో రూ.1000 ఉండగా రూ.10వేలకు పెంచారు. ఎక్కువమందికి రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రతి అదనపు సభ్యుడికి రూ.1000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజును రూ.5 వేలుగా నిర్ణయించింది. వీలునామా రిజిస్ట్రేషన్ కు రూ.3వేలు ఇలా అన్ని రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచి వినియోగదారులకు షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
