Chandra Babu Sketch: ముల్లును ముల్లుతో తీయ్యాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా? జగన్ నుంచి సొంత సామాజికవర్గాన్ని వేరుచేయాలని భావిస్తున్నారా? రెడ్డి సామాజికవర్గాన్ని టార్గెట్ చేశారా? ఆ వర్గం నుంచే నేతలను టీడీపీలోకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సొంత సామాజికవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నటాక్ నడిచింది. ఒక పద్ధతి ప్రకారం కమ్మ సామాజికవర్గం నాయకులను టార్గెట్ చేస్తూ కేసులు, అక్రమ అరెస్ట్ లతో జగన్ సర్కారు ఉక్కుపాదం మోపిందన్న ప్రచారం ఉంది. దీనికి తగ్గట్టుగానే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం, సంగం డెయిరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర, మైనింగ్ వ్యవహారంలో యరపతినేని శ్రీనివాసరావు, పోలవరం అక్రమాల్లో దేవినేని ఉమా, వివిధ కేసుల్లో చింతమనేని ప్రభాకరరావు, పరిశ్రమలో కాలుష్యమంటూ గల్లా జయదేవ్.. ఇలా టీడీపీలో ఉన్నకమ్మసామాజికవర్గం నాయకులను టార్గెట్ చేస్తూ జగన్ ప్రభుత్వం కేసుతో అణచివేతకు గురిచేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబు సరికొత్త ప్లాన్ తెరపైకి తెచ్చారు. జగన్ కు విరుద్ధంగా ఆలోచించారు. రాయలసీమలోని జగన్ సామాజికవర్గం నేతలను టీడీపీలోకి తెచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

అసంతృప్త నాయకులపై కన్ను..
ముఖ్యంగా నెల్లూరుతో పాటు రాయలసీమ రెడ్డీ సామాజికవర్గం నేతలు జగన్ పాలనపై వ్యతిరేక భావనతో ఉన్నారు. వైసీపీ పాలనలో తమకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్న బాధను వ్యక్తం చేస్తున్నారు. జగన్ చుట్టూ ఉన్న ఒకరిద్దరు తప్పిస్తే మిగతా వారికి మొండిచేయే మిగిలిందని వాపోతున్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజికవర్గం నేతలకు సముచిత స్థానం దక్కిందని.. జగన్ సర్కారులో ఆ పరిస్థితి లేదని అసంతృత్తితో ఉన్నారు. దీనిని గమనించిన చంద్రబాబు అసంతృప్త నేతలపై దృష్టిసారించారు. ఇప్పటికే టీడీపీలో రెడ్డి సామాజికవర్గం నేతలు యాక్టివ్ గా ఉన్నారు. వారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటూ వచ్చింది. పదవుల పంపకాల్లో సైతం ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి, కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, చిత్తూరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు పార్టీలో కీ రోల్ పాత్ర వహిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నారు. వారంతా వైసీపీలో అసంతృప్త నాయకులను గుర్తించే పనిలో ఉన్నారు.
ఆ నేతలందరికీ ఆహ్వానం…
టీడీపీలో రెడ్డి సామాజికవర్గ నేతలను పెంచేందుకు చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీ నుంచి రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాయలసీమకు చెందిన పెద్దతలకాయలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట మహిధర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, , మైసూరారెడ్డి, రామసుబ్బారెడ్డిలను టీడీపీలోకి ఆహ్వనించనున్నారు.ఇటీవల ఆనం రామనారాయణరెడ్డి కుమార్తె కైవల్యారెడ్డి నేరుగా చంద్రబాబు, లోకేష్ లతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మరోవైపు ఆనం కుటుంబానికి చెందిన ఆనం వెంకటరమణారెడ్డి టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.దాదాపు ఆనం కుటుంబమంతా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే రాయలసీమ నుంచి రెడ్డి సామాజికవర్గాన్ని టీడీపీలోకి తెచ్చి జగన్ ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.