Prakasam: “జై బోలో గణేష్ మహరాజ్ కీ జై” అని వినిపించాల్సిన చోట “ఊ అంటావా మామ.. ఉఉ అంటావా” అనే ఐటెం సాంగ్ వినిపించింది.వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే కొందరు భక్తి మాటున ఎంజాయ్ కి ప్రాధాన్యమిస్తున్నారు. భజనలతో కాలక్షేపం చేయాల్సిన చోట అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్ లు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఇటువంటి ఘటనే ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో వినాయక చవితి మండపాన్ని ఏర్పాటు చేశారు. పగలంతా పూజలు చేశారు. సాయంత్రమయ్యేసరికి ఆరుగురు యువతులతో రికార్డింగ్ డాన్స్ ఏర్పాటు చేశారు. అశ్లీల నృత్యాలతో అలరించారు. ఆ యువతులతో స్థానిక యువకులు డ్యాన్సులతో హోరెత్తించారు. అయితే ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు చూడకపోవడం విశేషం. అయితే వేలాదిమంది ప్రజలు వీక్షిస్తుండడం అంతకంటే విడ్డూరం.
స్థానిక వైసీపీ నేతలు ఈ రికార్డింగ్ డాన్స్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో భారీగా జనాలు తరలివచ్చారు. అయితే ఏకంగా వినాయకుడి విగ్రహం ఎదుటే యువతులు అశ్లీల నృత్యాలు చేయడం విమర్శలకు తావిచ్చింది. పోలీసులు అటువైపు చూడకపోవడం అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఇటువంటి పరిస్థితే ఉంటుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.