Bihar Polling: బిహార్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు అపూర్వ ఉత్సాహం కనబరిచారు. మొత్తం 18 జిల్లాల్లోని 121 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 64.69 శాతం ఓటింగ్ నమోదై రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త రికార్డు నెలకొంది. పోలింగ్ పూర్తిగా శాంతియుత వాతావరణంలో జరగడం గమనార్హం. గతంలో జరిగిన అల్లర్లు, బూత్ క్యాప్చరింగ్ సంఘటనలు లేకుండా ఈసారి ఎన్నికలు సాఫీగా జరగడం ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
Also Read: ఇక విద్యార్థులే జగన్ నమ్మకమట!
ఓటెత్తిన జనం..
బిహార్ తొలి విడత ఎన్నికల్లో ముజఫర్‌నగర్‌లో అత్యధికంగా 71 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా పాట్నాలో 58 శాంత నమోదైంది. ఈసారి పోలింగ్ బిహార్ జనసామాన్యంలో రాజకీయ చైతన్యం పెరిగిందని సూచిస్తోంది. పట్నా వంటి పట్టణాల్లో కూడా మంచి ప్రతిస్పందన రావడం ఈసారి సామాన్య ప్రజల పాలిట ఎన్నికలు ముఖ్యమయ్యాయని సూచిస్తుంది.
ప్రభావం చూపని సర్ వివాదం..
ఎన్నికల ముందు ఓటర్ జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పై పెద్ద ఎత్తున చర్చ, రచ్చ జరిగింది. ఓట్లు తొలగించారని కాంగ్రెస్ పెద్ద ఆందోళన చేసింది. రాహుల్‌గాంధీ ఓట్‌చోరీ పేరిట యాత్ర చేశారు. కానీ వీటి ప్రభావం ఏదీ పోలింగ్‌పై పడలేదు. పోలింగ్ అనంతరం గణనీయమైన ఫిర్యాదులు లేకపోవటం ప్రజలు ఆ ప్రక్రియను అంగీకరించినట్లుగా అర్థం చేసుకోవచ్చు.
60 శాతం సెంటిమెంట్ ..
ఇక బిహార్‌లో ఒక సుదీర్ఘ సెంటిమెంట్ ఉంది. పోలింగ్ శాతం 60 దాటితే లాలూ యాదవ్ విజయం సాధించారని, తక్కువైతే నితీశ్‌కుమార్ విజయం సాధించారని గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. 1990, 1995, 2000 ఎన్నికల్లో 60 శాతం పైగా పోలింగ్ నమోదు కాగా, లాలూ గెలిచారు. 2005, 2010, 2017లో తక్కువ ఓటింగ్‌తో నితీశ్ విజయినయ్యారు. ఈసారి తిరిగి 64.69 శాతం పోలింగ్ నమోదవడంతో ఫలితాలపై ఉత్కంఠ పెరిగింది.
సురక్షిత వాతావరణం..
గతంలో భద్రతా లోపాల కారణంగా బిహార్‌లో 5–6 విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. ఈసారి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత ప్రశాంతంగా పూర్తవ్వడం ప్రజల్లోని విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఓటర్లకు భయంలేని వాతావరణం కల్పిస్తే ఎన్నికలలో పాల్గొనడం సహజమని ఈసారి బిహార్ నిరూపించింది.
మహిళా ఓటర్ల ఉత్సాహం..
2014 తర్వాత బిహార్ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ క్రమంగా పెరుగుతోంది. 2015లో 60.48 శాతం మహిళలు ఓటేసి రికార్డు సృష్టించారు. 2020లో కూడా మహిళా పాల్గొనింపు పురుషుల కన్నా ఎక్కువ. నితీశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమ కార్యక్రమాలు, భద్రతా చర్యలు, విద్యా ప్రోత్సాహ పథకాలు అమలు చేయడం ఈ పెరుగుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నితీశ్ కూటమికి రాజకీయంగా బలాన్నిస్తుంది.
యువత ఓటు ఎటో..
ఈసారి పెద్ద ఎత్తున యువ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. యువకులు ప్రధానమంత్రి మోదీ ఆకర్షణతోనా, లేక తేజశ్వి యాదవ్ లాంటి యంగ్ లీడర్ ప్రతిఛాయతోనా ఓటు వేశారన్నది ఫలితాల్లో తేలుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో ఒక కొత్త శ్లోగన్ అందుకుంది.. ‘‘నమో’’ స్థానంలో ‘‘నిమో’’ (నితీశ్–మోదీ) నినాదం. ఈ వ్యూహం సీట్ల లెక్కలో ఎలా ఆడుతుందో, రెండో విడత ఓటింగ్ అనంతరం స్పష్టత రానుంది.
నవంబర్ 11న రెండో విడత ఓటింగ్, 14న ఫలితాలు ప్రకటించనున్నారు. పెరిగిన ఓటింగ్ శాతం తుది ఫలితాల్లో ఎవరికి లాభించబోతుందో అనేది ఈసారి బిహార్ ఎన్నికలలో ప్రధాన ప్రశ్నగా మారింది.