Breakup Leave Request: సాధారణంగా ఉద్యోగులు ప్రతి వారానికి ఒకసారి వీక్లీ ఆఫ్ తీసుకుంటారు. సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వారు అయితే రెండు రోజులపాటు సెలవులు ఉంటాయి. ఇవే కాకుండా ఒక్కోసారి ఏదైనా అత్యవసరం ఏర్పడినప్పుడు ప్రత్యేకంగా ఎమర్జెన్సీ లీవ్స్, సిక్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అలాగే ఆరోగ్య ఆరోగ్య అవసరాలకు సెలవులు ఇస్తుంటారు. కానీ ఓ వ్యక్తి తన ప్రేమ విఫలమైందని లీవ్ అడిగారు. దీంతో ఆ కంపెనీ సీఈఓ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సెలవును మంజూరు చేశాడు. ఇంతకీ లీవ్ అడిగిన వ్యక్తి ఎవరు? సెలవు అడగగానే ఆ కంపెనీ సీఈవో ఎలా స్పందించాడు?
చైనాలో కొన్ని రోజుల కిందట ఉద్యోగులు తమ మూడు బాగా లేకపోతే సెలవులు తీసుకోవచ్చని కొన్ని కంపెనీలు ఆఫర్ చేశాయి. మనసు బాగా లేనప్పుడు ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరని.. అందువల్ల ఈ సమయంలో సెలవులు అడిగితే మంజూరు చేస్తామని ఆ కంపెనీ ప్రకటించింది. చాలామంది ఉద్యోగులు ఇలా సెలవులు మంజూరు చేస్తే బాగుండు అని అనుకున్నారు. కానీ మన దేశంలో కొన్ని కంపెనీలు ఎంత అత్యవసర పరిస్థితి ఉన్నా.. సెలవులు మంజూరు చేయడానికి అధికారులు ఒప్పుకోరు. అయితే ఓ కంపెనీ సీఈవో మాత్రం దయా హృదయంతో ఓ వ్యక్తి అడగగానే సెలవు మంజూరు చేశాడు.
నాన్ డేటింగ్ అనే సంస్థ సీఈవో జస్వీర్ సింగ్ ఇటీవల తనకు వచ్చిన ఒక మెయిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక ఉద్యోగి ప్రేమలో విఫలం కావడంతో తన మనసు బాగాలేదని.. అందువల్ల పనిచేయలేక పోతానని.. తనకు సెలవులు మంజూరు చేయాలని కోరుతూ మెయిల్ చేశాడు. అయితే ఈ మెయిల్ పై స్పందించిన సంస్థ సీఈవో వెంటనే సెలవును మంజూరు చేశాడు. తమ సంస్థలో ఉద్యోగుల విధులపై మాత్రమే కాకుండా భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని.. అందువల్లే ఏ మాత్రం ఆలోచించకుండా సెలవులు మంజూరు చేసామని ఆ సీఈవో చెప్పుకొచ్చాడు. మా సంస్థలోని ఉద్యోగులు ఏ విషయాలు అయినా తమలో దాచుకోరని.. ప్రతి విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటారని అన్నారు. అలాగే నేటి కాలంలో యువత తమ సమస్యలను ఇతరులతో చెప్పుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటారని అన్నారు.
అయితే ఈ లీవ్ పై సర్వత్రా చర్చ సాగుతోంది. చాలామంది ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు. కొందరు ఇంట్లో సమస్యల వల్ల మూడ్ ఆఫ్ అయి ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో సెలవులు ఇస్తారా? అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కంపెనీలు అత్యవసర పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదని.. దీంతో చాలామంది ఉద్యోగులు తమ ఇంట్లో సమస్యను పరిష్కరించుకోలేక ఉద్యోగాలే మానేశారని అంటున్నారు. అయితే ఉద్యోగుల మనోభావాలను కూడా కంపెనీలను అర్థం చేసుకోవాలని.. నిజాయితీగా సెలవులు అడిగితే తప్పక మంజూరు చేయాలని కొందరు కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలా సెలవులు మంజూరు చేయడం మంచి పరిణామం అని కొందరు కొనియాడుతున్నారు.