Telangana Congress
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. స్క్రూటినీ కూడా పూర్తయింది. ఇక మిగిలింది ఉపసంహరణ మాత్రమే. రేపటితో ఆ గడువు కూడా ముగియనుంది. దీంతో బరిలో మిగిలేది ఎవరో తేలిపోనుంది. రాష్ట్రంలో ప్రధానంగా గజ్వేల్, మేడ్చల్, కామారెడ్డిలో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక రెబల్స్ విషయానికి వచ్చే సరికి బీజేపీ, బీఆర్‌ఎస్‌కు పెద్దగా ఇబ్బందులు లేవు. కానీ, కాంగ్రెస్ 15 స్థానాల్లో రెబల్స్ తలనొప్పిగా మారారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. బుజ్జగింపులు షురూ చేసింది. నవంబర్ 15 మధ్యాహ్నం వరకు రెబల్స్ నామినేషన్ ఉపసంహరించుకోకుంటే నష్టం తప్పదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
మూడు పార్టీలకు రెబల్స్..
ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు రెబల్ బెడద దడ పుట్టిస్తోంది. పలు స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరు పార్టీలు మారితే, మరికొందరు మాత్రం రెబల్‌గా బరిలో దిగి సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పటాన్‌చెరు నుంచి అభ్యర్థిగా నీలం మధు పేరును ముందుకు ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో కాట శ్రీనివాస్‌గౌడ్‌ను పేరును అధిష్టానం ఖరారు చేసింది. దాంతో అసంతృప్తికి గురైన నీలం మధు బీఎస్పీ అభ్యర్ధిగా నామినేషన్ వేసి, కాంగ్రెస్ అభ్యర్ధిపై యుద్ధం ప్రకటించారు. నారాయణఖేడ్ సీటుపై వివాదం రేగినా తెర వెనుక నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా మంతనాలు జరపడంతో చివరి నిముషంలో అభ్యర్ధిని మార్చింది కాంగ్రెస్. సురేష్ షెట్కార్ ప్లేసులో సంజీవరెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక వనపర్తి స్థానానికి మొదట తన పేరు ప్రకటించి మూడో జాబితాలో మరొకరికి కేటాయించడంపై పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి రాష్ట్ర నేతల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నూరు నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైతే వివేక్ పార్టీలోకి వచ్చారో ఇక టికెట్ రాదనుకున్న బోడ జనార్ధన్.. జాబితాలో పేరు లేదని తేలిన తరువాత పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే గులాబీ దండులో చేరారు. ఎన్నికల టైంలో బోడ జనార్దన్ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ఇక శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్‌ను జైపాల్, రఘునాథ్, సత్యంరావు ఆశించారు. కానీ, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన జగదీశ్వర్‌గౌడ్‌కు టికెట్ ఇచ్చింది హైకమాండ్. దాంతో సత్యంరావు రెబల్‌గా తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. ఇల్లందులో టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు చీమల వెంకటేశ్వర్లు సహా పలువురు బరిలో నిలిచారు. పినపాకలోనూ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా విజయ గాంధీ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. అదేవిధంగా సూర్యాపేటలో పటేల్ రమేష్‌రెడ్డి, నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్ , ఆదిలాబాద్‌లో సంజీవరెడ్డి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇటు బోథ్‌లో వన్నెల అశోక్, జుక్కల్‌లో గంగారాం కాంగ్రెస్ రెబల్‌గా బరిలో నిలిచారు. సూర్యాపేటలో కాంగ్రెస్‌లో ఐదో జాబితా అక్కడ చిచ్చుపెట్టింది. పార్టీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న రమేశ్ రెడ్డిని కాదని రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో అసమ్మతి జ్వాల రగులుకుంది. పటేల్ రమేశ్‌రెడ్డి నామినేషన్ వేశారు.
మిగిలింది కొన్నిగంటలే..
కాంగ్రెస్ పార్టీలో ఈ రెబల్స్ బెడద గుబులు పుట్టిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా కొన్ని గంటలే మిగిలింది. దీంతో అధిష్టానం రంగంలోకి దిగింది. రెబల్స్ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడింది. ఆ బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి అప్పగించారట. అసంతృప్త నేతలతో మాట్లాడి, రెబల్ బెడద లేకుండా చేసేలా కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది.
గులాబీ బాస్‌కు తప్పని గుబులు..
ఇక బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు రెబల్స్ బెడద లేకపోయినా ఆయన పోలీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డిలో రాష్ట్రంలోనే అత్యధిక నామినేషన్లు దాఖలు కావడం ఆయను ఆందోళనకు గురిచేస్తోంది. అభ్యర్థులందరి తరఫున సభలు నిర్వహిస్తున్న కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేసినవారిని ఉపసంహరించే బాధ్యతను పార్టీ నేతలకు అప్పగించారు. గజ్వేల్‌లో ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు రంగంలోకి దిగారు. కామారెడ్డిపై కేటీఆర్ దృష్టిపెట్టారు. ఉద్యోగాలు రాలేదని, పరిహారం ఇవ్వలేదు, భూములు ఆక్రమించారన్న ఆగ్రహంతో గజ్వేల్, కామారెడ్డిలో సామాన్యులు సైతం నామినేషన్లు వేశారు. మరోవైపు ఈటల రాజేందర్, రేవంత్‌రెడ్డి కూడా ఆయా నియోజకవర్గాల్లో బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు నామినేషన్లు ఉప సంహరించేందుకు బీఆర్‌ఎస్ నేతులు ప్రయత్నిస్తున్నారు. సామ, దాన, భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారని తెలుస్తోంది. మరి బుధవారం మధ్యాహ్నం నాటికి వీరంతా అధిష్టానం మాటకు సర్దుకుంటారా..? రెబల్స్‌గానే బరిలో ఉంటారా..? అన్న చర్చమాత్రం జోరందుకుంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rebels to congress top leaders in appeasement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com