Vijaya Garjana Sabha: తెలంగాణ రాష్ర్ట సమితి (టీఆర్ఎస్) విజయగర్జన సభ నిర్వహించాలని హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందు భావించింది. కానీ అక్కడ ఏ ఫలితం ఎదురవుతుందో అనే అనుమానంతోనే వాయిదా వేసుకుంది. తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. హుజురాబాద్ లో చేదు అనుభవం ఎదురు కావడంతో విజయగర్జన సభను విరమించుకుంది. ఇన్నాళ్లు ఏ ఎన్నికలొచ్చినా తమదే విజయమని విర్రవీగే అధికార పార్టీ టీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. దీంతో విజయగర్జన నినాదాన్ని కొన్నాళ్లు పక్కన పెట్టాలని నిర్ణయించింది.

కానీ టీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో అంతర్మథనంలో పడిపోయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత అయినా విజయగర్జన నిర్వహించొచ్చు. కానీ ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తుందనే సాకుతో కూడా విజయగర్జన సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 2023 సాధారణ ఎన్నికల వరకు సభ నిర్వహణపై దృష్టి పెట్టకపోవచ్చని సమాచారం. దీంతో పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు దక్కని వారిని బుజ్జగించే క్రమంలో అధిష్టానం నిమగ్నమైనట్లు చెబుతున్నారు. దీని కోసం నామినేటెడ్, జిల్లా, రాష్ర్ట, పార్టీ కమిటీల్లో నియమించేందుకు కసరత్తు ప్రారంభినట్లు తెలుస్తోంది. దీని కోసం రాష్ర్టవ్యాప్తంగా ఖాళీగా ఉన్న కార్పొరేషన్ పదవుల్లో నియమించేందుకు ఆశావహుల జాబితా ఖరారు చేస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని దూరం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇప్పటికే కొందరు ఏ పదవి దక్కకపోతే పార్టీని వీడి వేరే పార్టీలో చేరి పదవులు దక్కించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేతలను బతిమాలి తమ దారికి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అసంతృప్తులను సంతృప్తి పరచి పార్టీ విజయావకాశాలను మెరుగు పరచుకోవాలని యోచిస్తోంది. గులాబీ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నామినేటెడ్ పదవులకు అర్హులను ఎంపిక చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.