CM Jagan: జగన్ వైఫల్యాలపై పీకే ఘాటు వ్యాఖ్యల వెనుక కారణం అదే

దేశంలో సంపద సృష్టి,అవకాశాలు, నిరుద్యోగం, పేదరికం, ఉచిత పథకాలు, నగదు పంపిణీ వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. సంపద సృష్టి తోనే సమాజం అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు.

Written By: Dharma, Updated On : October 30, 2023 12:28 pm
Follow us on

CM Jagan: గత ఎన్నికల్లో జగన్ అంతులేని విజయానికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒకరు. ఏపీ ప్రజలను కులాలు, వర్గాలు, ప్రాంతాలుగా విడగొట్టి జగన్ గూటికి చేరేలా ప్లాన్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే సక్సెస్ అయ్యారు. తన విజయానికి పీకే కారణమని జగన్కు ఇప్పటికీ విశ్వాసమే. అయితే ఎన్నికల అనంతరం పీకే రాజకీయ వ్యూహకర్తగా కాకుండా.. తానే స్వయంగా రాజకీయవేత్తగా ఎదగాలని చూస్తున్నారు. స్వరాష్ట్రం బీహార్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వ్యూహ కర్తగా తాను చేసినది కరెక్ట్ అయ్యుండొచ్చుగానీ.. ఇప్పుడు ఓ రాజకీయవేత్తగా ఏపీ ని చూస్తున్న ఆయనకు మనస్థాపం కలుగుతోంది. ఏపీకి ఈ పరిస్థితి రావడానికి తాను ఒక కారణమని ఆయన భావిస్తున్నట్టున్నారు. చేసిన తప్పును బాహటంగా చెప్పుకోలేక బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. జగన్ పాలనను ఏకంగా తప్పు పట్టి ప్రాయశ్చిత్తం వ్యక్తం చేయడం విశేషం. బీహార్ రాజకీయాలతో బిజీగా ఉన్నా ఆయన బ్రాండ్ అవతార్ సంస్థ నిర్వహించిన సదస్సులో ఏపీ పై కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.

దేశంలో సంపద సృష్టి,అవకాశాలు, నిరుద్యోగం, పేదరికం, ఉచిత పథకాలు, నగదు పంపిణీ వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. సంపద సృష్టి తోనే సమాజం అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. సంపదను సృష్టించలేని ప్రభుత్వాలు వెనుకబాటు తనానికి కారణం అవుతాయని చెబుతూ.. జగన్ నేతృత్వంలోనే ఏపీ ప్రభుత్వాన్ని ఉదహరించడం విశేషం. ఏపీలో సంపద సృష్టి నామమాత్రమని, ఉచిత నగదు పంపిణీ తో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలా ఉంటే సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. అయితే పీకే ప్రత్యేకంగా ఏపీ గురించి ప్రస్తావించడం, జగన్ ప్రభుత్వంలో మైనస్లను ఎత్తిచూపడం చర్చనీయాంశంగా మారింది.

గత ఎన్నికల్లో కలిసి వచ్చిన వర్గాలన్నీ జగన్కు దాదాపు దూరం అయ్యాయి. ఉద్యోగ, ఉపాధ్యాయులు, మధ్యతరగతి, ఉన్నతశ్రేణి వర్గాలు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ సైతం జగన్ చర్యలను తప్పు పట్టడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఏపీలో పాలన వైఫల్యాలు, రాజకీయ నిర్ణయాలపై గత కొంతకాలంగా ప్రశాంత్ కిషోర్ జగన్ వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆయన బాహాటంగానే వ్యతిరేకించడం విశేషం.