Vizianagaram train accident: విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణమా? వరుస ఘటనలు జరుగుతున్నా వైఫల్యాల నుంచి రైల్వే శాఖ గుణపాఠాలు నేర్చుకోవట్లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదం.. కొద్ది నెలల కిందట ఒడిశాలోని బాలేశ్వర్ ఘటన తరహాలోనే ఉండడం విశేషం. విశాఖ- పలాస ప్యాసింజర్ సిగ్నల్ లేకపోవడంతో ట్రాక్పై నెమ్మదిగా వెళుతోంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది.
ప్రమాద ఘటనా స్థలమైన కంటకాపల్లి వద్ద ఆదివారం ఉదయం నుంచి సిగ్నలింగ్ లో సమస్య ఉన్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు సరి చేస్తూ వస్తున్నా పూర్తిస్థాయిలో సమస్య కొలిక్కి రాలేదు. ఇలాంటి లోపం వల్లే కంటకాపల్లి దాటాక పలాస ప్యాసింజర్ కు సిగ్నల్ సరిగా లేక దాదాపు నిలిచిపోయింది. ఆ సమయంలో కంటకాపల్లి వద్ద ఆగిపోవాల్సిన రాయగడ ప్యాసింజర్ వేగంగా ముందుకెళ్లిపోయింది. ఆగి ఉన్న పలాస ప్యాసింజర్ ను ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఓ రైలు ఒక స్టేషన్ నుంచి వెళ్లి.. తరువాత స్టేషన్ దాటే వరకు.. వెనుక వచ్చే రైలుకు సిగ్నల్ ఇవ్వరు. కంటకాపల్లి దాటిన తర్వాత.. కొంత దూరం వెళ్ళాక భీమాలి సమీపంలో పలాస ప్యాసింజర్ ఆగిపోయింది. తరువాత వచ్చే అలమండ స్టేషన్కు అది చేరుకోలేదు. ఈ లెక్కన వెనుక ఉన్న రాయగడ ప్యాసింజర్ కచ్చితంగా కంటకపల్లి రైల్వే స్టేషన్ లో ఆగాలి. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. సాధారణంగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలు ఉంటే రైలు 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలి. కానీ ఇక్కడ రాయగడ ప్యాసింజర్ చాలా వేగంతో ప్రయాణించి పలాస ప్యాసింజర్ ఢీకొట్టింది.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి మానవ తప్పిదమే కారణమా అన్న అనుమానాలు ఉన్నాయి. సిగ్నలింగ్ను పర్యవేక్షించకపోవడం, అందులో లోపాలు ఉన్నా సరైన చర్యలు తీసుకోకపోవడం తదితర కారణాలతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే రైలు ఆగిపోవాలి. కానీ ఇక్కడ రాయగడ ప్యాసింజర్ అతివేగంగా ముందుకు పోవడం.. ముమ్మాటికి సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కారణమని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.