
కేంద్ర మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ప్రధాని మోడీ డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఈ మేరకు శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారని.. పనిచేయని వారిని తొలగించే కొత్త వారిని అందులో నియమించాలనుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే యువతకు అవకాశం ఇవ్వబోతున్నారని.. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ట్రాలకు కేంద్రమంత్రి పదవులు కేటాయించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక్కో కేంద్రమంత్రి పదవిని ఇచ్చిన మోడీ.. ఏపీ నుంచి మాత్రం ఒక్కరికి కేంద్ర కేబినెట్ లో చోటివ్వలేదు. ఈ క్రమంలోనే ఈసారి ఏపీ నుంచి ఒక కేబినెట్ మంత్రి ఇవ్వాలని మోడీ నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గంలో పవన్‌కళ్యాణ్‌కు మంత్రి పదవి లభిస్తుందనే వార్తలతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హోరెత్తుతోంది.
తెలుగు మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ తన సోదరుడి అడుగుజాడల్లో నడుస్తారని.. జనసేనను బీజేపీలో కలిపేసి కేంద్రమంత్రి అవుతాడని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ ప్రసారం చేయడం ప్రారంభించాయి. మెగాస్టార్ చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తరువాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు తన పార్టీని బిజెపిలో విలీనం చేసే ప్రణాళికలు లేవని, అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పవన్ ను సిఎం అభ్యర్థిగా తెరపైకి తెస్తుందని మీడియా చెబుతోంది. దీనికి ముందు బీజేపీ పవన్ ను కేంద్ర మంత్రిగా ఎదిగేలా చేస్తుందంటున్నారు.
అయితే ఈ ఊహాగానాలను పవన్ కళ్యాణ్ బృందం ఖండించింది. బిజెపి ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు అలాంటి ప్రతిపాదనలు రాలేదని కొట్టిపారేసింది. దీంతో పవన్ ను కేంద్రకేబినెట్ లోకి తీసుకుంటున్నారన్న వార్త అబద్దమని తేలింది.