India drone wars: ఒకప్పుడు యుద్ధాలు అంటే కత్తులు, బల్లాలు, గుర్రాలు, ఏనుగులు, సైన్యం ఉండేది. తర్వాత తుపాకులు, ఫిరంగులు వచ్చాయి. ఆ తర్వాత యుద్ధ విమానాలు, రాకెట్ లాంచర్లు, అణ్వస్త్రాలు వచ్చాయి. ప్రస్తుతం ఫైటర్ జెట్‌లు, డ్రోన్లు యుద్ధాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి, రాష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఎక్కువగా డ్రోన్లతోనే జరుగుతోంది. ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్తాన్ కూడా భారత్‌పైకి డ్రోన్లు ప్రయోగించింది. అయితే ఎస్–400 సహాయంతో భారత్ వాటిని కూల్చింది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ప్రాధాన్యతను గుర్తించిన భారత్.. కూడా ఇప్పుడు డ్రోన్ యుద్ధానికి సిద్ధమైంది. సైన్యం చేతికి అత్యాధునికి డ్రోన్ అస్త్రాలను సమకూరుస్తోంది. భారత సైనిక దళాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు డ్రోన్ సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించాయి. అక్టోబర్ 6 నుంచి 10 వరకు మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్న సైనిక విన్యాసాలు ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు. సమీకృత రక్షణ విభాగం(ఐడీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భారత సైన్యం తమ డ్రోన్ సామర్థ్యాలతోపాటు శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేసే సాంకేతికతలను పరీక్షించనుంది. ఈ విన్యాసాలు త్రివిధ దళాల సమన్వయంతో జరుగుతున్న తొలి కార్యక్రమంగా నిలుస్తాయి.
ఆపరేషన్ సిందూర్‌తో పాఠాలు..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినప్పుడు, పాకిస్థాన్ ప్రతిస్పందనగా భారీ సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించింది. ఈ సంఘటన డ్రోన్ యుద్ధంలో భారత సైన్యం ఎదుర్కొన్న సవాళ్లను స్పష్టం చేసింది. ఐడీఎస్ ఉపాధిపతి ఎయిర్ మార్షల్ రాకేశ్ సిన్హా ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఈ అనుభవాలను వివరిస్తూ, శత్రు డ్రోన్లను నియంత్రించే సాంకేతికతలను వేగంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ ఆపరేషన్ నుంచి నేర్చుకున్న పాఠాలు భవిష్యత్ యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శత్రు కంటే ఒక అడుగు ముందుండాలంటే, సైనిక వ్యూహాలు, ప్రణాళికలు నిరంతరం నవీకరణకు గురికావాలని ఆయన సూచించారు.
తక్కువ కాలంలోనే అత్యాధునిక డ్రోన్లు..
అక్టోబర్‌లో జరిగే సైనిక విన్యాసాలు కేవలం సైన్యానికి మాత్రమే పరిమితం కాదు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఈ సహకార విధానం డ్రోన్ సాంకేతికతలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు, దేశ గగనతల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. ఈ విన్యాసాల ద్వారా భారత సైన్యం తమ యుద్ధ సామర్థ్యాలను పరీక్షించడమే కాక, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతుంది.
ఆపరేషన్ సిందూర్ ద్వారా బయటపడిన లోటుపాట్లను సరిదిద్దేందుకు ఈ విన్యాసాలు ఒక వేదికగా నిలుస్తాయి. శత్రు డ్రోన్లను నిర్వీర్యం చేసే సాంకేతికతలను అభివృద్ధి చేయడంతోపాటు, సైనిక దళాల సమన్వయాన్ని, సాంకేతిక ఆవిష్కరణలను పెంచే దిశగా ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. రాకేశ్ సిన్హా సూచనల మేరకు, భారత సైన్యం శత్రువు కంటే ఎల్లప్పుడూ ముందుండేలా వ్యూహాత్మక ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ విన్యాసాలు ఆ లక్ష్యం వైపు ఒక నిర్ణయాత్మక అడుగుగా పరిగణించవచ్చు.