RDO System: ఇంట్లో దూరిన ఎలుకను పట్టేందుకు.. ఇల్లు మొత్తం తగలబెట్టాడట వెనుకటికి ఒక వ్యక్తి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం కూడా అదే విధంగా ఉంది. రెవెన్యూ శాఖలో ఉద్యోగుల తీరు వల్ల ఆ శాఖకు చెడ్డ పేరు వస్తోందని, అందుకే దానిని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించానని చెప్పిన కేసీఆర్.. అందులో ఉన్న ఉద్యోగులను వేరే శాఖలకు మళ్ళించారు. వారి కొలువులను శాశ్వతంగా రద్దు చేశారు. వాస్తవానికి రెవెన్యూ శాఖ ఉద్యోగుల తీరు బాగోలేదు అనుకున్నప్పుడు.. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. దానిని ప్రక్షాళన చేయాలి. అంతేకానీ కొండనాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయే విధంగా ఉండకూడదు. ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ఇప్పటికీ రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. భూ సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం తన మానస పుత్రికగా ప్రచారం చేసుకుంటూ తెరపైకి తీసుకువచ్చిన ధరణి వల్ల భూములు కోల్పోయిన వారూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇన్ని సమస్యలు కనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం వీఆర్వో వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది. తాజాగా ఆర్డీవో వ్యవస్థలను కూడా రద్దు చేసేందుకు నడుం బిగించింది. త్వరలో వీరిని ప్రభుత్వ ఆసుపత్రుల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించేందుకు కసరత్తు చేస్తోంది.
రెవెన్యూ శాఖలో వీఆర్వోలు, వీఆర్ఏ లు తెలంగాణ ఉద్యమంలో గణనీయమైన పాత్రను పోషించారు. పథకాలను మారుమూల గ్రామాల దాకా చేరవేయడంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో 42 రోజులపాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. వ్యవస్థలను మొత్తం స్తంభింపజేశారు. ఇప్పుడు ఈ మాటలను గుర్తు చేస్తే రాష్ట్ర పాలకులు చిరాకు పడుతున్నారని వీఆర్వోలు, వీఆర్ఏలు అంటున్నారు.. కావలి శేరు, శేర్ శింది, మస్కూరి, నీరడి, తోటి తలారి పేర్లతో పిలవబడుతూ, గౌరవ సూచనంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా గుర్తింపు పొందిన వీరు తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు 23 వేలకు పైగా ఉండేవారు. ఇప్పుడు వీరి సంఖ్య 20, 555 మందికి తగ్గిపోయింది. మిగతా ఖాళీల గురించి ప్రభుత్వం చెప్పడం లేదు. జీవో నెంబర్ 52 ప్రకారం నియామక ప్రక్రియలో వీరు అదే గ్రామస్తులై ఉండాలి. ఇలా ఆ గ్రామం పై పూర్తిస్థాయిలో అవగాహన, పట్టు కలిగి ఉండాలి.. రెవెన్యూ నుంచి మొదలుపెడితే పోలీస్ శాఖ వరకు, వీఐపీలు ఎవరు గ్రామాల్లోకి వచ్చిన వీఆర్ఏలు, వీఆర్వోలు సహకరించేవారు. వారి అధికారిక అవసరాలను, చిన్న చిన్న పనులను వీరు చేసి పెట్టేవారు.
మొదట్లో వీఆర్ఏలు, వీఆర్వో ఉద్యోగాలలో వెనుకబడిన తరగతి కులాలకు చెందిన బీసీలు, దళితులు, అక్కడక్కడ మైనారిటీల వారు ఉండేవారు. క్రమంగా ఆధిపత్య కులాల వారు కొంతమంది వచ్చి చేరారు. ఇందులో కొందరు ముందు జాగ్రత్తగా శాఖపరమైన పరీక్షలు రాసి పదోన్నతి పొంది అధికారులయ్యారు. మరికొందరు సర్వీస్ కమిషన్ ద్వారా చేరారు. గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించి వ్యవస్థను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులను కూడా తొలగించి వారిని ఇతర శాఖలకు సర్దుబాటు చేయడంతో గ్రామ రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో నీరుగార్చింది.
రెండవసారి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం ప్రారంభమైంది. వీఆర్ఏలను ఇబ్బంది పెట్టి భూమి వివరాలను ధరణి పోర్టల్ లో నింపింది. ఈ పని చేసినందుకు వీఆర్వోలకు అవార్డులు, రివార్డులు ఇచ్చింది. ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ అధికారాలు తొలగించింది. దీంతో ఆ కేసులు మొత్తం కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా రెవెన్యూ వ్యవస్థ పని చేయలేని పరిస్థితికి వచ్చింది. ట్రిబ్యునళ్ళు కూడా పనిచేయకుండా చేశారు. తహసీల్దార్లను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ లంటూ పనిచేయకుండా కుర్చీకే పరిమితం చేశారు. వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటు చేసేటప్పుడు వీఆర్ఏలకు స్కేలు ఇస్తూ రెవెన్యూ శాఖలో రెగ్యులరైజ్ అయ్యేలా చేస్తామని మాట ఇచ్చారు. కొన్ని సర్వీస్ రూల్స్ తయారు చేస్తామని చెప్పారు. కానీ ఇచ్చిన ఏ మాటను కూడా ప్రభుత్వం నిలబెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. రెండు సంవత్సరాల తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో పదివేల మందిని నిరక్షరాస్యులని గుర్తించారు. ఇప్పుడున్న 20,555 మందిలో దాదాపు సగం మందిని అనర్హులంటూ నీటిపారుదల, వ్యవసాయం, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖలోకి మార్చాలి అనుకుంటున్నారు. కొంతమందిని లష్కర్లుగా సర్ది పెడతామంటున్నారు. నిరక్షరాసులైన వీఆర్ఏలను ఏం చేస్తారనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. గ్రామ రెవెన్యూ అధికారులను తొలగించి వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసిన ప్రభుత్వం.. గ్రామ రెవెన్యూ సహాయకులను కూడా తొలగించి వారిని ఇతర శాఖలకు సర్దడంతో గ్రామ రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చింది.