Bhola Shankar: ఏపీ సర్కార్ కు ‘భోళా శంకర్’ సీరియస్ రిక్వెస్ట్

సినిమా టిక్కెట్లు విషయమై గతంలో చిరంజీవి నాయకత్వంలో ప్రత్యేక బృందం సీఎం జగన్ కలిసిన సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్ ఆధారంగా టిక్కెట్ల ధర పెంపు విషయం అనుమతులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Written By: Dharma, Updated On : August 9, 2023 2:07 pm

Bhola Shankar

Follow us on

Bhola Shankar: వైసీపీ సర్కార్ పై మెగాస్టార్ చిరంజీవి చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. ఇప్పటివరకు సీఎం జగన్ తో సన్నిహితంగా మెలిగిన చిరంజీవి పొలిటికల్ కామెంట్స్ కు దూరంగా ఉండేవారు. ఇప్పుడు అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నారు. పిచ్చుక పై మీ బ్రహ్మాస్త్రం ఏంటని.. సినిమా పరిశ్రమపై పడతారెందుకని ప్రశ్నించారు. ప్రజలకు బాగా పాలించండి అంటూ సలహా ఇచ్చారు. వైసీపీ మంత్రులు, నేతలు దీటుగా స్పందించారు. కానీ చిరంజీవి కామెంట్స్ ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.

ఇప్పటివరకు పవన్ వర్సెస్ వైసీపీ సర్కార్ అన్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు పవన్ కు మద్దతుగా చిరంజీవి తెరపైకి వచ్చారు. చిరు తాజా కామెంట్స్ తో వైసీపీ వర్గాల్లో ఆందోళన ప్రారంభమైంది. మెగాస్టార్ పై వారంతా ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే మంత్రి అంబటి సినీ పరిశ్రమకు గట్టి హెచ్చరికలు పంపారు. ఈ తరుణంలో చిరు వ్యాఖ్యానించడం వివాదం మరింత ముదిరింది. ఈ తరుణంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈనెల 11న విడుదల కానుంది.

అయితే ఈ సినిమాకు ఎటువంటి అడ్డంకులు ఏర్పడతాయోనన్న ఆందోళన మెగా అభిమానుల్లో ఉంది. గతంలో కూడా వైసిపి సర్కార్ను ప్రశ్నించిన సినీ వర్గాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సరిగ్గా ఇప్పుడు సినిమా రిలీజ్ సమయానికి చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయంలో మూవీ మేకర్స్ నుంచి వైసీపీ సర్కార్కు ఒక విన్నపం వెళ్ళింది. అయితే సినిమా బడ్జెట్ ఆధారంగా టిక్కెట్ల ధర ఉంటుందని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు భోళా శంకర్ సినిమా బడ్జెట్ వివరాలను అందించాలని ఏపీ సర్కార్ సూచించినట్లు తెలిసింది. అయితే తాజాగా చిరంజీవి కామెంట్స్ తో ఈ సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయమై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని చర్చ నడుస్తోంది.

సినిమా టిక్కెట్లు విషయమై గతంలో చిరంజీవి నాయకత్వంలో ప్రత్యేక బృందం సీఎం జగన్ కలిసిన సంగతి తెలిసిందే. సినిమా బడ్జెట్ ఆధారంగా టిక్కెట్ల ధర పెంపు విషయం అనుమతులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి చిరంజీవి సైతం ఆహ్వానించారు. ఇప్పుడు అదే చిరంజీవి ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో భోళా శంకర్ టిక్కెట్ల ధరల పెంపు విషయంలో తీసుకున్న నిర్ణయం పై ఆసక్తి కొనసాగుతోంది.

ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం చిరంజీవి పలు విషయాలను వెల్లడించి సినిమాపై అంచనాలు పెంచేశారు. ముఖ్యంగా చెల్లెలు సెంటిమెంట్ ఉంటుందని ప్రకటించారు. వాల్తేరు వీరయ్యకు మించి ఈ చిత్రం సూపర్ హిట్ సాధిస్తుందని మెగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ తరుణంలో ప్రభుత్వంపై చిరు వ్యాఖ్యలు.. టిక్కెట్ ధర పెంపు విషయం హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా.. సినిమా మాత్రం తప్పకుండా విజయవంతం అవుతుందని మెగా అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.