Rayalaseema Industries: పారిశ్రామికాభివృద్ధి రాయలసీమలో కుంటుపడింది. పరిశ్రమలకు రాజకీయ గ్రహణం పట్టింది. మామూళ్లు ఇచ్చుకోలేక.. పరిశ్రమలు నడపలేక మూతపడుతున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి అనువైన ప్రాంతంలో రాజకీయ రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. ప్రాంత అభివృద్ధిని కాలరాస్తోంది. ఫలితంగా సీమ నుంచి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి.

తెలుగుదేశం హయాంలో పెనుకొండ ప్రాంతంలో కార్ల తయారీ పరిశ్రమ కియాను ఏర్పాటు చేశారు. కియా పరిశ్రమకు అనుబంధంగా విడిభాగాల తయారీ పరిశ్రమలు కూడ ఏర్పాటయ్యాయి. కానీ 2019 తర్వాత పరిస్థితి మారిపోయింది. అధికార వైకాపా నాయకుల బెదిరింపులతో చాలా పరిశ్రమలు తమిళనాడుకు తరలిపోయాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. తమ వారికి ఉద్యోగాల కోసం, కాంట్రాక్టుల కోసం, మామూళ్ల కోసం వైకాపా నేతలు ఒత్తిడి చేశారని, ఫలితంగా విడి భాగాల తయారీ పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని టీడీపీ నేతలు విమర్శించారు. అదే సందర్భంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కియా పరిశ్రమ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటన కూడ వెలుగులోకి వచ్చింది.
యాడికి మండలం రాయల చెరువులోని బలపం పౌడర్ పరిశ్రమ మూతపడింది. దీనికి కారణం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పనిలో పనిగా అనంతపురంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యేకు మామూళ్లు ఇచ్చుకోలేక పరిశ్రమలు మూతపడ్డాయని జేసీ ఆరోపించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. పెద్ద ఎత్తున పనులు ప్రారంభించారు. కానీ ఆయన మరణానంతరం ఆ పరిశ్రమ అటకెక్కింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి పూనుకున్నారు. కానీ ఇంతలోనే టీడీపీ అధికారం కోల్పోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమవుతుందని సీమ ప్రజలు ఎదురుచూశారు. కానీ బ్రహ్మణి పరిశ్రమకు బదులుగా జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. కానీ కార్యరూపం దాల్చుతుందా అనుమానం సీమ ప్రజల్లో వ్యక్తమవుతోంది.
సీమలో పారిశ్రామికాభివృద్ధి లోపించడానికి ముమ్మాటికి అధికార పార్టీ నాయకులేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మామూళ్ల కోసమో, కమీషన్ల కోసమో పరితపిండం తప్పా.. ప్రాంత అభివృధ్దికి ఇసుమంతైన ప్రయత్నించడంలేదని ఆరోపిస్తున్నాయి.