Homeజాతీయ వార్తలుTV9 - Ravi Prakash : టీవీ9 ఆఫీస్ కు రవి ప్రకాష్.. మళ్లీ ఏదో...

TV9 – Ravi Prakash : టీవీ9 ఆఫీస్ కు రవి ప్రకాష్.. మళ్లీ ఏదో గెలుకుతున్నాడు?

TV9 – Ravi Prakash : తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు రవి ప్రకాష్ అనే పేరు కొత్తేం కాదు. 24 గంటల పాటు న్యూస్ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది తనే. టీవీ9 అనే చానెల్ ను స్థాపించింది కూడా తనే. అది ఈరోజు కన్నడ, హిందీ, గుజరాతి వంటి భాషలకు విస్తరించిందంటే దానికి కారణం రవి ప్రకాషే. ఏం తేడాలు జరిగాయో? ఎవరు ఎలాంటి పన్నాగాలు పన్నారో, లేకుంటే తన స్వయంకృతాపరాధమో తెలియదు గాని.. బయటికి వెళ్లిపోయాడు. ఎన్నో రకాల కోర్టు కేసులు ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నాడు. అలాంటి రవి ప్రకాష్ ఆర్ టీవీ పేరుతో ఒక శాటిలైట్ ఛానల్ లాంచ్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఇది యూ ట్యూబ్ లో వస్తోంది. దీనికి తొలి వెలుగు, మెరుపు అనే చానల్స్ కూడా అనుబంధంగా పనిచేస్తున్నాయి.

టీవీ9 నుంచి బయటికి వెళ్లిపోయిన రవి ప్రకాష్.. బుధవారం అకస్మాత్తుగా టీవీ9 కార్యాలయంలో కనిపించాడు. వాస్తవానికి రవి ప్రకాష్ టీవీ9 నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ కార్యాలయాన్ని అంతగా సందర్శించలేదు. బుధవారం అతడు హఠాత్తుగా అక్కడి కార్యాలయంలో కనిపించడంతో ఒకింత సందడి నెలకొంది. కార్యాలయానికి వచ్చిన కొంతసేపటికే అతడు రిసెప్షన్లో ఉన్న యువతిని పలకరించాడు. అనంతరం లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళిపోయాడు. అక్కడ తన పనులు ముగించుకున్న తర్వాత వెంటనే కిందకు వచ్చాడు. కిందకు రావడంతోనే మీడియా జనాలు రవి ప్రకాష్ ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు అడిగారు. ” నేను టీవీ9 లో భాగస్వామిని. నాతో పాటు మై హోమ్, మెగా, ఇంకా మూర్తి అనే వ్యక్తి కూడా భాగస్వాములు. ఖాతాలు పరిశీలించేందుకు వచ్చానని” రవి ప్రకాష్ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వాస్తవానికి గతంలో టీవీ9 వివాదం తలెత్తినప్పుడు రవి ప్రకాష్ ఇలాంటి విషయాలు చెప్పలేదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా మౌనమే సమాధానంగా చెప్పాడు.. కానీ ఈసారి మీడియా అడగని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాడు. వాస్తవానికి టీవీ9 లో రవి ప్రకాష్ కు 10 శాతం వాటా ఉందని తెలుస్తోంది. రవి ప్రకాష్ టీవీ9 ఛానల్ కార్యాలయంలోకి ప్రవేశించగానే ఎవరో చెప్పినట్టు పలు రకాల మీడియా ప్రతినిధులు అక్కడికి వచ్చారు. వాస్తవానికి రవి ప్రకాష్ వచ్చిన విషయం ముందుగానే లీక్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఎలాగూ రవి ప్రకాష్ కూడా కావాల్సింది అదే కాబట్టి.. అలానే జరిగిపోయింది.

ఖాతాలు పరిశీలించేందుకు బుధవారం తను టీవీ9 కార్యాలయానికి వచ్చానని రవి ప్రకాష్ చెప్పారు. కానీ వాస్తవానికి టీవీ9 లో 97% వాటా ఒకే సంస్థకు ఉందని తెలుస్తోంది. మిగిలిన మూడు శాతం వాటాలో రవి ప్రకాష్ తో పాటు, ఇంకా కొంతమంది ఉన్నారని తెలుస్తోంది. టీవీ9 సంస్థకు సంబంధించిన ఈజీఎం సమావేశం మార్చి 2న జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ఈనెల 6న వాటాదారులకు నోటీస్ ఇచ్చామని టీవీ9 యాజమాన్యం చెబుతోంది. అందులో ఉన్న వాటా ప్రకారం రవి ప్రకాష్ మైనర్ షేర్ హోల్డర్ అని తెలుస్తోంది. అలాంటప్పుడు ఖాతాలను తనిఖీ చేసే అధికారం ఉండదని సమాచారం. అంటే ఈ ప్రకారం రవి ప్రకాష్ టీవీ9 ఆఫీస్ కొచ్చి.. తాను ఖాతాలు తనిఖీ చేసేందుకు వెళ్లానని.. తన పని ముగిసింది కాబట్టి వెళ్తున్నానని.. యూట్యూబ్ ఛానల్స్ కి చెప్పింది మొత్తం అబద్ధమేనా? అలా చెప్పాల్సిన అవసరం రవి ప్రకాష్ కి ఏంటి? మళ్లీ ఏదైనా తవ్వుతున్నాడా? కెసిఆర్ ఎలాగూ ముఖ్యమంత్రి కాదు కాబట్టి, రేవంత్ రెడ్డికి టీవీ9 మీద గుడ్ ఒపీనియన్ లేదు కాబట్టి.. తిరిగి హస్తగతం చేసుకునేందుకు ఏదైనా ప్రణాళికలు రచించాడా? ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular