Ravela Kishore: ఏపీ బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్‌బాబు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. గత ఆరు నెలలుగా బీజేపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. ఆయన అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ తరునున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. వెనువెంటనే చంద్రబాబు కేబినెట్‌లో అమాత్య పదవిని అందుకోగలిగారు.ఇంచుమించు మూడేళ్ళపాటు ఆయన మంత్రి పదవిలో కొనసాగారు. మంత్రిగా ఆయన పనితీరు ఆశించినంతగా లేకపోవడంతో 2017లో చంద్రబాబు అతనిని మంత్రి వర్గం నుంచి తప్పించి… వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబును తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన కిశోర్ బాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరారు.
ఆ తరువాత రావెల జనసేనను కూడా వీడి కన్నా లక్ష్మీనారాయణ ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రత్తిపాడు నుంచి తిరిగి ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తున్న కిషోర్‌బాబు అందుకు బీజేపీ అనువైన పార్టీ కాదని భావించి కొన్ని నెలలుగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తిరిగి సొంతగూటికి చేరాలని భావిస్తున్న ఆయన కొద్ది కాలంగా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారు. గత ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి చెందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా పార్టీని వీడి వైసీపీలో చేరడంతో ప్రస్తుతం అక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దించాలని టీడీపీ అన్వేషిస్తున్నది. అయితే ప్రస్తుతానికి మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యకు తాత్కాలికంగా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించి సరైన అభ్యర్థిని ముందుగానే ఎంపిక చేయాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉంది.
ఆశావహులు అధికం..
ప్రత్తిపాడు సీటుపై అనేక మంది ఆశలు పెట్టుకొని అధినేత చంద్రబాబు అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని కలిసి టీడీపీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రత్తిపాడు నియోజకవర్గంలోని టీడీపీ కేడర్‌కు తిరిగి దగ్గరయ్యేందుకు అక్కడ ఏ ప్రైవేటు కార్యక్రమం జరిగినా టీడీపీ నేతలతో పాటు కలిసివెళ్ళి పాల్గొంటున్నారు. టీడీపీ సీనియర్ నేతలు మాకినేని పెదరత్తయ్య, ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌లతో కూడా కలిసి పార్టీలో చేరాలనే తన ఆకాంక్షను తెలిపారు. ఇటీవల రాజధాని రైతులు ప్రత్తిపాడు మీదుగా పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు టీడీపీ నేతలతో పాటు కలిసి పాల్గొని ఉద్యమానికి సంఘీబావం తెలిపారు.
చంద్రబాబు అనుగ్రహించేనా?
ఇటీవల గుంటూరులో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన చంద్రబాబును అదే సమయంలో అక్కడ ఉన్న కిషోర్‌బాబు కలుసుకొని నమస్కరించి మర్యాద పూర్వకంగా పలకరించారు. అయితే ఉద్యోగాన్ని వీడి వీడకమునుపే పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి గెలిపించడమే కాకుండా మంత్రి పదవిని కూడా కట్టబెట్టిన చంద్రబాబును వీడి రావెల కిషోర్‌బాబు వేరే పార్టీలోకి వెళ్ళడంపై ఆగ్రహంతో ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గ పార్టీ శ్రేణులు తిరిగి ఆయన రాకను ఎంతవరకు ఆమోదిస్తారనేది చూడాలి.. కాగా కిషోర్‌బాబు తన రాజీనామా లేఖలో మాత్రం మోదీపై తనకు ఎంతో అభిమానం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే గతంలో కూడా ఆయన ఆయా పార్టీలకు రాజీనామా చేసే సమయంలో లేఖల్లో ఇదే విధంగా పేర్కొనడం విశేషం.
Recommended Video: