AP DSC: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ఏపీ క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. 6,100 ఉపాధ్యాయుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో 40 అంశాలతో కూడిన అజెండాను సుదీర్ఘంగా చర్చించారు. వాటికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కీలకమైంది డీఎస్సీ-2024. మరో రెండు రోజుల్లో ఈ నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
గత నాలుగున్నర సంవత్సరాలుగా డీఎస్సీ కోసం ఉపాధ్యాయ శిక్షణ పొందిన అభ్యర్థులు ఆశగా ఎదురు చూశారు. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ప్రకటిస్తానని జగన్ విపక్షనేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. 2018లో చంద్రబాబు సర్కార్ 7,200 ఉపాధ్యాయుల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ ఇన్ని తక్కువ పోస్టులను భర్తీ చేస్తారా? అంటూ నిలదీశారు. ఇది ఒక పోస్టులేనా? అని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తానని చెప్పుకొచ్చారు.కానీ నాలుగున్నర సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదల ముంగిట డీఎస్సీ విడుదలకు కసరత్తు చేస్తున్నారు. అది కూడా కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.
మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇందులో వచ్చిన వెయిటేజీ మార్కులను డీఎస్సీలో కలపనున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో టెట్ తో పాటు డీఎస్సీ పరీక్షను ఒకేసారి నిర్వహించారు. కానీ ఈసారి వేర్వేరుగా నిర్వహించనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. పోస్టుల ఖాళీలు, విధి విధానాలు, తేదీలు, నోటిఫికేషన్ విడుదల తేదీ, ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది.. అన్న విషయాలపై సమావేశంలో చర్చిస్తారు. రెండు రోజుల్లో డీఎస్సీ 2024 విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.