
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన దళితుడైన శీలం రంగయ్య లాకప్ డెత్ కేసు సీబీఐకి అప్పగించాలని, త్వరగా న్యాయ విచారణ జరపాలని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కు లేఖ రాశారు. రంగయ్యను గతనెల 24న పోలీసులు వన్యప్రాణుల చట్టం కింద అరెస్టు చేశారని పోలీసు దెబ్బలు తాళలేక, వేధింపుల వల్ల 26వ తేదీన లాకప్ లో మరణించినట్టు అనుమానాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 24వ తేదీన రంగయ్యను అరెస్టు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారని, 26వ తేదీన రంగయ్య చనిపోయినట్టు చెబుతున్నారని, 24న అరెస్టు చేస్తే 26 వరకు పోలీసు స్టేషన్ లోనే ఎందుకు ఉంచారని లేఖలో అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్ మీద కూడా పలు అనుమానాలు ఉన్నాయని చెప్పారు.
రంగయ్య తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదన్న టీ కాంగ్రెస్ నేతలు.. ఆ పేరుతో వేధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. రంగయ్య ఆచారాల ప్రకారం అతడిని పూడ్చి పెట్టి సమాధి చేస్తారని, కానీ, పోలీసులు అందుకు భిన్నంగా వారి ఆచారానికి భిన్నంగా మృతదేహాన్ని దహనం చేశారని చెప్పారు. ఇది మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. పోలీసులు రంగయ్య కుటుంబాన్ని బెదిరించి కాంప్రమైజ్ కావాలని ఒత్తిడి చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. గతంలో మంథనిలోనే మధుకర్ అనే దళితుడి అనుమానాస్పద మృతి విషయంలో కూడా పోలీసులు ఎలాంటి ఆధారాలు బయటపెట్టలేదని టీ కాంగ్రెస్ నేతలు తమిళి సై సౌందర్ రాజన్ కు గుర్తు చేశారు.