Ramoji Rao Vs Jagan: రాజ గురువు రామోజీ అసలు సిసలు యుద్ధం చేస్తున్నారు. నేరుగా జగన్ తోనే తలపడుతున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వంతో ఇంతలా రామోజీరావు ఫైట్ చేసిన దాఖలాలు లేవు. కానీ జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం ముసుగు తీయక తప్పలేదు. పేరుకే చంద్రబాబు విపక్ష నేత.. కానీ అంతకుమించి అన్నట్టు రామోజీరావు వ్యవహార శైలి ఉంది. రోజురోజుకీ జగన్ సర్కారుపై రాతలు శృతిమిస్తున్నాయి. ఎన్నికల నాటికి ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని సృష్టించి.. జగన్ నుంచి వారిని దూరం చేయడమే లక్ష్యంగా రామోజీరావు పావులు కదుపుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రామోజీరావు న్యూట్రల్ గానే ఉండేవారు. ఈనాడు రాతలు కూడా మధ్యస్థంగానే సాగేవి. జగన్ సతీమణి భారతి, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ తరచూ కలుసుకునే వారు కూడా. వారి మధ్య బంధుత్వం కూడా కుదిరింది అన్న ప్రచారం సాగింది. దీంతో జగన్ సర్కార్ పై వ్యతిరేక కథనాలు విషయంలో ఈనాడు కొంత వెనక్కి తగ్గింది. కానీ ఎక్కడ ఏం జరిగిందో కానీ.. ఈనాడు మళ్లీ వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా కథనాలను నింపడం ప్రారంభించింది.
గత నాలుగు దశాబ్దాలుగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాజ గురువు రామోజీ చక్రం తిప్పేవారు. తన అడుగులకు మడుగులోత్తే విధంగా ప్రభుత్వాలు సాగిలాలు పడేలా వ్యవహరించేవారు. 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. సాక్షి ఆగమనముతో ఈనాడు దూకుడుకు బ్రేకులు పడ్డాయి. కానీ మీడియా మొఘల్ గా తనకు అలవాటు పడిన విద్యను మాత్రం రామోజీ విడిచిపెట్టలేదు. తన ఆధిపత్యానికి గండి కొట్టిన జగన్ పై రివేంజ్ కే రామోజీ అధిక ప్రాధాన్యమిచ్చారు. చివరకు ప్రభుత్వ యాడ్ల రూపంలో వచ్చిన ఆదాయాన్ని కూడా వదులుకున్నారు. జగన్ కు వ్యతిరేకంగా మారిన క్రమంలో ప్రో టిడిపి మీడియా గా మారిపోయారు.
2014లోనే రాష్ట్ర విభజన జరిగింది. తొలిసారిగా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రెండోసారి వైసీపీ చేజిక్కించుకుంది. ఈ తరుణంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూడాలి. దానికి అనుగుణంగా కథనాలు రాయాలి. కానీ ప్రజల్లో విద్వేషం రెచ్చగొట్టాలన్న ధోరణిలో… తెలంగాణ, ఏపీ మధ్య వ్యత్యాసాలను చూపుతూ.. అక్కడ అభివృద్ధి, సంక్షేమ పథకాలుజరుగుతున్న తీరును ఏపీతో సరిపోల్చుతూ.. వార్తలు, కథనాలను వండి మార్చుతున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. కేవలం అక్కడ సంక్షేమ ఫలాలు ఎక్కువగా ఉన్న వాటిని మాత్రమే చూపి.. ఏపీ ని తక్కువ చేసి చూపుతున్నారు. సహజంగానే ఇది జగన్కు నష్టం చేస్తోంది. జగన్ అభిమానించిన వారు సైతం క్రమేపీ దూరమవుతున్నారు. జగన్ పై అభిమానం ఉన్న వారు సైతం బయటకు మాట్లాడేందుకు భయపడుతున్నారు. అందుకే జగన్ సైతం దుష్ట చతుష్టయములో రామోజీనే అగ్ర భాగాన ఉంచుతున్నారు. ఆయన ద్వారా జరిగే నష్టాన్ని అధిగమించేందుకు.. కేసుల ద్వారా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.