
Ramoji Rao- Chandrababu: చంద్రబాబుపై రామోజీరావు విమర్శలు చేశారట. ఇబ్బందిపెట్టాలని చూశారట. ఈనాడులో వ్యతిరేక కథనాలు ప్రచురించారట. అయినా చంద్రబాబు రామోజీరావుపై కోపం పెంచుకోలేదట. ఆయన మంచితనాన్ని, మంచి మనసును చూసి తిరిగి చంద్రబాబే ముగ్ధుడయ్యాట. ఇంతకీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా.. టీడీపీ అధినేత చంద్రబాబే. మార్గదర్శి పేరిట వైసీపీ సర్కారు రామోజీరావుతో పాటు ఆయన కుటుంబాన్ని వేదిస్తోందని బాబుగారు తెగ బాధపడుతున్నారు. జిల్లాల పర్యటనలో ఇదే అంశంపై మాట్లాడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే రామోజీరావును టార్గెట్ చేసుకొని జగన్ సర్కారు ఇబ్బందిపెడుతోందని ఆరోపిస్తున్నారు.
వకల్తా తీసుకున్న బాబు..
కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించారు. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో హాజరయ్యారు. చాలాచోట్ల రోడ్ షోలు, సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల రామోజీరావు ఎపిసోడ్ ను ప్రస్తావించారు. మార్గదర్శి సంస్థ విశ్వసనీయత, నిజాయితీ గురించిచ చంద్రబాబు వకల్తా తీసుకొని మాట్లాడారు. మార్గదర్శిలో పెట్టుబడులు, డిపాజిట్ల పక్కదారిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నసంగతి తెలిసిందే ఇప్పటికే ఒక విడత రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ లను సీఐడీ విచారించింది. నిబంధనలు అతిక్రమించినట్టు వారే స్వయంగా ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. మరోసారి విచారణ చేపట్టే అవకాశముందన్న టాక్ నడుస్తోంది.
టీడీపీ సర్కారుతో పోరాటం చేశారట..
అయితే రామోజీరావుపై కక్ష సాధింపులో భాగంగానే విచారణలు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ రంగాల ప్రముఖులతో ఈనాడులో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు సైతం రామోజీరావు విశ్వసనీయతపై ప్రకటనలు చేయడం గమనార్హం. చంద్రబాబు మరో అడుగు ముందుకేసి మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాల మీద పోరాడిన రామోజీరావు, చంద్రబాబు మీద కూడా చాలా విమర్శలు చేశారట. అయినా సరే.. ఆయన విలువలున్న వ్యక్తి అని తెలుసు గనుక.. ఆయనను చంద్రబాబు ఎఫ్పుడూ ఇబ్బంది పెట్టలేదట. దీనిపై భిన్నరకాలైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రాజగురువు పాత్ర…
చంద్రబాబును పొలిటికల్ ఎస్టాబ్లిష్ చేసింది రామోజీరావు. సీఎం చేయడంలో కీరోల్ ప్లే చేసింది రామోజీరావు. అంతెందుకు మరోసారి అధికారంలోకి తెచ్చి ఎనిమిది పదుల వయసులో కింగ్ మేకర్ గా అవతరించాలని చూస్తున్నది రామోజీరావే. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనపై వ్యతిరేక కథనాలు రాసింది కూడా అరుదు. చంద్రబాబును వ్యతిరేకించే టీడీపీ వర్గాలపై రాస్తారు కానీ చంద్రబాబుపై పని కట్టుకొని రాసింది లేదు. అయినా రాజ గురువు తనపై వ్యతిరేకంగా పావులు కదిపారని చంద్రబాబు గుర్తుచేస్తున్నారు. అది కూడా లోక కళ్యాణం కోసం అన్నట్టు చెప్పుకొస్తున్నారు.తన మాట వినని రామారావుకు వ్యతిరేకంగా ఒక దశలో రామోజీరావు రెచ్చిపోయారే తప్ప.. చంద్రబాబును ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. చంద్రబాబు ఇటువంటి ప్రకటనలు చేసి తనను తాను తక్కువ చేసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.