Chandrababu: ఏదైనా విమర్శ చేయాలంటే అర్థంపర్థం ఉండాలి. ప్రజలు నమ్ముతున్నారు కదా అని.. ఏది పడితే అది అంటే నవ్వుల పాలయ్యేది మనమే. ఇప్పుడు ఏపీలో కూడా అటువంటి విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల లండన్ పర్యటనకు సీఎం జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై తెలుగుదేశం పార్టీ ఒక విమర్శ చేసింది. చార్టర్ ఫ్లైట్ లో పేదల పక్షపాతి అంటూ ఆరోపణలు చేసింది. రాజకీయం కాబట్టి అలా చేయడం సాధారణం. కానీ రాజ గురువు రామోజీ తన ఈనాడులో ప్రత్యేక కథనం ప్రచురించడం జుగుప్సాకరంగా ఉంది.
సాధారణంగా రాజకీయ నాయకుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అంతా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. చిన్నపాటి నాయకులు సైతం విమానాల్ని ఆశ్రయిస్తున్నారు. అటువంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆపై పారిశ్రామికవేత్త అయిన జగన్ ఫ్లైట్లో వెళ్లడాన్ని తప్పు పట్టడం సమంజసం కాదు. కానీ రామోజీరావు ఈనాడులో ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. జగన్ తో పాటు ఆయన సతీమణి గంటకు రూ.2.71 లక్షల చొప్పున చెల్లించి.. విలాసవంతమైన చార్టర్ విమానంలో లండన్ వెళ్లారని.. ఆ విమానం ఖరీదు 435 కోట్ల రూపాయలని.. రాష్ట్రంలో రెండు మూడు కిలోమీటర్లు వెళ్లాలన్నా జగన్ హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారని.. ఇదంతా ప్రజాధనమేనని ఈనాడు కథనం సాగింది.
జగన్ ఇటీవల తరచూ చెప్పుకునే మాట క్లాస్ వార్. రాష్ట్రంలో పేదలకు, పెత్తందారికి యుద్ధం జరుగుతోందని.. పేదలకు తాను సంపద పంచడం పెత్తందారులకు ఇష్టం లేదని తరచూ చెప్పుకొస్తున్నారు. ఈ మాటను ఉటంకిస్తూ ఈనాడులో రామోజీరావు ప్రత్యేక కథనం రాసుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. మన ప్రజా ప్రతినిధులు విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రత్యేక విమానాల వాడకం అనేది సర్వసాధారణం. ఇంతకు ముందున్న చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగ లేదా? కుటుంబాలతో విదేశీ పర్యటనలు చేయలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు రామోజీరావుకు ఇప్పుడు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అప్పట్లో చంద్రబాబు ఏమైనా విదేశాలకు సైకిల్ పై వెళ్ళారా? అని సెటైర్లు పడుతున్నాయి. ఈ కథనం ఉద్దేశపూర్వకంగా ఉందని.. చిన్నపాటి నాయకులు సైతం విమానాలెక్కే రోజులు ఇవని.. రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి కథనాలు రాస్తున్నారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ప్రజాధనం దుర్వినియోగం చేయడం ముమ్మాటికీ తప్పే. అది చంద్రబాబు చేసినా.. జగన్ చేసినా.. ఒకే మాదిరిగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రామోజీ రాతలు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా.. జగన్కు వ్యతిరేకంగా సాగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.