Ramoji Rao Vs Jagan: జగన్ సర్కార్ అర్జెంటుగా గద్దె దిగాలి.. ఇది రాజ గురువు రామోజీరావు అభిమతం. జగన్ పై విపరీత ద్వేషం పెట్టుకున్న ఆయన తన ఈనాడు రాతల ద్వారా వైసీపీ సర్కార్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.చివరకు కుల, మత సంఘాల సమావేశాలను సైతం భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. తనకున్న లార్జెస్ట్ సర్కులేషన్ మీడియాను మరి తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఈనాడు పాఠకాభిమానులకు కూడా రుచించడం లేదు.
రామోజీరావుకు జగన్తో భారీ వైరం ఉంది. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇందులో ఏ ఒక్కరు వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి వారే అన్నట్టు ముందుకు సాగుతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని జగన్.. మీడియా మొగల్ గా రామోజీరావు ఎంత చేయాలో అంతలా చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఇద్దరూ గాడి తప్పుతున్నారు. రామోజీరావు విషయాన్ని పరిగణలో తీసుకుంటే.. ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాయడంలో తప్పులేదు. ఆ క్రమంలో జుగుప్సాకర రాతలు మాత్రం మరి అభ్యంతరకరంగా ఉంటున్నాయి. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పోల్చుతూ.. జగన్ పాలనను రామోజీ ఎండగడుగుతున్నారు. కానీ అదే తెలంగాణతో పోల్చుకొని ఇక్కడ సంక్షేమ పథకాలను మాత్రం ప్రస్తావించడం లేదు. ఎక్కడైనా పాలనను బేరీజు వేసుకోవాలంటే ముందున్న ప్రభుత్వంతో పోల్చాలి. చంద్రబాబు పాలనతో జగన్ పోలుస్తున్నారా? అంటే అదీ లేదు.
ప్రభుత్వ బాధిత వర్గాలే ఇప్పుడు రామోజీ రాతలకు సూత్రధారులు. జగన్ సర్కార్ లో కింది స్థాయిలో తప్పులు జరగడం సహజం. అటువంటి వారిని ఒకే వేదిక పైకి తెప్పించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయిస్తున్నారు. నిన్న గుంటూరులో జరిగింది అదే. దళిత, క్రైస్తవ సంఘాల పేరుతో కొందరు సమావేశమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అసలు ఏపీలో సమస్యలే లేవన్నట్టు.. ఆ సమావేశానికి ఈనాడులో ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. కేవలం రామోజీతో జగన్ కు ఉన్న విభేదాల పుణ్యమా అని.. ఇటువంటి అప్రాధాన్య వార్తలకు సైతం.. ఎంతో ప్రాధాన్యమిస్తున్నారు. రామోజీరావు తనకున్న స్థాయిని తగ్గించుకుంటున్నారు.