Chandrababu- Ramoji Rao: మీడియా అంటే నిజాన్ని నిజం లాగా చూపించాలి. జరిగిన దాన్ని జరగనట్టు ప్రదర్శించాలి. అంతేకానీ నిజాన్ని దాచి, ఏమీ జరగనట్టు దాయడం మీడియా పని కాదు. ఒక రాజకీయ పార్టీకి భజన చేయడం మీడియా బాధ్యత అనిపించుకోదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ మీడియా మాత్రం సొక్కం అనే ప్రశ్న తలెత్తడం కామన్. ఎందుకంటే మీడియా అంత కరాబ్ అయిపోయింది కాబట్టి. ఇక తెలుగు నాట మీడియా సంగతికి వస్తే ముఖ్యంగా పత్రికా రంగంలో ఈనాడు మొదటి స్థానంలో కొనసాగుతోంది. దీని యజమాని రామోజీరావు. ఈయన పసుపు భక్తి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రతి విషయంలోనూ ఆయన తన ఆస్థాన తెలుగుదేశం పార్టీని రక్షించుకునే ప్రయత్నాలు చేస్తారు. సీనియర్ ఎన్టీఆర్ తో సయోధ్య ఉన్న కాలం నుంచి ప్రస్తుతం చంద్రబాబు ఎరా వరకు ప్రతిదీ టిడిపి కోణంలోనే ఉంటుంది. టిడిపి ప్రయోజనాల కోసమే ఈనాడు వార్త రాస్తుంది. తాజాగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి టిడిపి మద్దతు (జగన్ దూకుడు అలా ఉంది మరి) ఇస్తోందనే సమాచారం తెలియకూడదని రామోజీరావు భావిస్తున్నట్టున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం చేసిన బిజెపిపై ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని, ఆ ప్రభావం తాను ఆరాధించే తెలుగుదేశం పార్టీపై పడకూడదని పరితపిస్తున్నారు.
అటు పార్లమెంట్, ఇటు రాజ్యసభలో ఢిల్లీ సర్వీస్ బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ కు విపక్షాలు పట్టుపట్టాయి. దీంతో ఓటింగ్ జరపాల్సి వచ్చింది. రాజ్యసభలో మొత్తం 238 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 131 మంది అనుకూలంగా, 102 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగిలిన వారు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ బిల్లుకు తెలంగాణ అధికార పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా ఓటు వేశాయి. కానీ ఎన్డీఏ కు టిడిపి మద్దతు ఇవ్వడాన్ని రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు పూర్తిగా దాచి పెట్టింది. మరో ఎల్లో పత్రిక ఆంధ్రజ్యోతి మాత్రం వాస్తవాన్ని రాసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలు తమ మంత్రాంగంతో బిజూ జనతాదళ్, టిడిపి, వైసిపి మద్దతును కూడగట్టారని గొప్పగా రాసింది. ఈ మూడు పార్టీలు మద్దతుగా ఓటు వేయడంతోనే రాజ్యసభలో బిల్లు నెగ్గిందని ఆంధ్రజ్యోతి రాస్కొచ్చింది. కానీ ఈనాడు మాత్రం టిడిపి మద్దతు ఇచ్చిన విషయాన్ని దాచింది.
ఏపీలో భారతీయ జనతా పార్టీపై ఉన్న వ్యతిరేకతను వైసీపీ వైపు మళ్లించేందుకు ఈనాడు టిడిపి పేరును దాచిందని తెలుస్తోంది. అత్యున్నత సభలో, బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఏ పార్టీ ఎటువైపు ఉందో తెలియని స్థితిలో జనం ఉన్నారని భ్రమ పడటం ఈనాడు కే చెల్లింది. ఇలా టిడిపికి కాపు కాస్తూ చంద్రబాబు మెప్పు పొందేందుకు ఈనాడు పడరాని పాట్లు పడింది. సమాచార హక్కు చట్టంపై ఉద్యమాలు చేసిన ఈనాడు.. రాజకీయ ప్రయోజనాలకు వచ్చేసరికి దాచేందుకు వెనుకాడటం లేదు. లోకానికి తెలిసిన విషయాలే రామోజీరావు దాస్తున్నారు అంటే.. టిడిపి కి సంబంధించిన అంతర్గత విషయాలు ఇంకా ఎన్ని దాచారో అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.