Margadarsi Case: మార్గదర్శి మీద జగన్ మరింత ముందుకే వెళుతున్నాడు. బిజెపి పెద్దలకు రామోజీరావు చెప్పుకున్నప్పటికీ జగన్ వినిపించుకోవడం లేదు. పైగా మరో దఫా సిఐడి ద్వారా లేఖ పంపించాడు. రామోజీరావు లో మరింత కాక పెంచాడు. ఇదంతా జరుగుతుంటే రామోజీరావు ఏం చేస్తున్నట్టు? జగన్ మీద ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబోతున్నట్టు?
సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతికి, దేశంలోని పత్రికల సర్కులేషన్ లెక్కించే ఏబీసీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆ మధ్య ఏపీలోని వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతినెలా రెండు వందలు ఇస్తామని ప్రకటించింది. ఈ రెండువందలతో తనకు ఇష్టం వచ్చిన పత్రిక కొనుక్కోవచ్చని జీవో జారీ చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, ఇతర వ్యవహారాలు వాలంటీర్లకు తెలియాలి అంటే వారు వార్తాపత్రికలు కొనుగోలు చేయాలని ఆదేశం జారీ చేసింది. పైకి చూస్తే ఇది పారదర్శకంగా కనిపించినప్పటికీ.. వాలంటీర్లు ఏపీ ప్రభుత్వంలో పని చేస్తున్నారు కాబట్టి.. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలో ప్రభుత్వ పథకాల గురించి ఎక్కువగా రాస్తారు కాబట్టి.. అనివార్యంగానే ఆ పత్రికను వాలంటీర్లు కొనుగోలు చేస్తారని ఈనాడు ఆరోపిస్తోంది. ఇది తన సర్కులేషన్ ను ప్రభావితం చేస్తుందనేది ఈనాడు వాదన. ఇప్పటికే సర్కులేషన్ ఫిగర్లో ఈనాడుకు, సాక్షికి తక్కువ తేడా ఉంది. వాలంటీర్లకు ప్రభుత్వం పై విధంగా ఆదేశాలు ఇవ్వడం వల్ల తన మొదటి ప్లేస్ లోకి సాక్షి వస్తుందనేది ఈనాడు భయం. అందుకే ఈ జీవోను కొట్టివేయాలంటూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఈనాడు ఆశ్రయించింది..
ఒక దఫా విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో హైకోర్టు సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతికి, ఏ బి సి కి నోటీసులు జారీ చేసింది.. వాస్తవానికి ఈ వ్యవహారంలో అటు ఏ బి సి కి గాని ఇటు భారతీకి గాని ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటప్పుడు రామోజీరావు నోటీసులు ఎందుకు ఇప్పించారనేది చర్చనీయాంశంగా మారింది. మార్గదర్శి విషయంలో తనని ఇబ్బంది పెడుతున్న జగన్ ను నిలువరించేందుకు ఢిల్లీ ద్వారా రామోజీరావు పావులు కదుపుతున్నాడని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.