Ramadan 2025
Ramadan Month : ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ పర్వదినాలు మార్చి 2 నుంచి ప్రారంభం అయ్యాయి. మార్చి 1వ తేదీన సౌదీ అరేబియాలో నెలవంక దర్శనం ఇవ్వడంతో ఆ దేశంలో ఒక రోజు ముందు నుంచే ఉపవాసాలు ఉండడం ప్రారంభించారు. రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతారు. కఠోరమైన నియమాలతో ఈ దీక్షలు చేపట్టి అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉంటారు. సూర్యోదయానికి ముందు.. దీక్ష చేపట్టి సూర్యస్తమం తరువాత ముగిస్తారు. మధ్యాహ్న కాలం మొత్తం కనీసం నీళ్లు కూడా తాగకుండా ఉంటారు. ఈ క్రమంలో సాయత్రం రకరకాల వంటలు చేసుకొని ఆరగిస్తారు. అయితే పట్టణాలు, నగరాల్లో రాత్రి సమయాల్లో ఎక్కువగా ముస్లింలు వివిధ వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అందువల్ల రాత్రిళ్లు కొన్ని షాపులు కొనసాగుతాయి. వీరికి ప్రభుత్వం ఓ సదుపాయం కల్పించింది.. అదేంటంటే?
రంజాన్ మాసం మొత్తంలో 24 గంటలు షాపులు నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. సాధారణ రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు షాపులు నిర్వహించుకోవడానికి అనుమతి ఉంది. అయితే ఈ నెలలో ఎక్కువగా రంజాన్ కు సంబంధించిన షాపింగ్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మధ్యాహ్నం సమయంలో ఉపవాసం ఉన్న వారు రాత్రి సమయంలో షాపింగ్ చేయడానికి ఇష్టపడుతారు. అందుకే ఈ అవకాశం ప్రభుత్వం కల్పించింది.
Also Read : భారతదేశంలో రంజాన్ తేదీ ఖరారు.. ఏ రోజు నుంచి ఉపవాసం ఉండాలంటే..
అయితే షాపులు నిర్వహించేవారు కొన్ని నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది. ఇందులో పనిచేసేవారికి లేబర్ యాక్ట్ నియమాలు వర్తిస్తాయని తెలిపింది. షాపులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులకు 8 గంటల కంటే ఎక్కువగా పనిచేస్తే వారికి అదనంగా వేతనం చెల్లంచాలని తెలిపింది. అలాగే వారం మొత్తం 48 గంటల కంటే ఎక్కువ పనిచేయించుకున్నా.. అందుకు ఓడీ చెల్లించాలని కార్మిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఉద్యోగాలు చేసే ముస్లింలు కార్యాలయాల నుంచి ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఈ అవకాశం మార్చి 2 నుంచి మార్చి 31 వరకు వర్తిస్తుంది. సాయంత్రం ప్రార్థనలు ఉన్నందున ఈ అవకాశాన్ని కల్పించారు.
ఇక రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు హరీస్ స్టాళ్లు సందడి చేయున్నాయి. పట్టణాలతో పాటు నగరాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసి హరీస్, హలీమ్ తో పాటు వివిధ రకాల రుచికరమైన వంటలు అందుబాటులో ఉంచనున్నారు. ఈ స్టాళ్లకు ముస్లింలు రాత్రి సమయాల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. గతంలో ఈ స్టాళ్ల నిర్వహణ 12 గంటల వరకు మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు 24 గంటల అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కాస్త ఎక్కువ సమయం వరకు నిర్వహించే అవకాశం ఉంది. అయితే కూడళ్లలో ఈ స్టాళ్లు నిర్వహించేవారు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తున్నారు.