Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు రాజ్యసభ సీటు?

గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తనకు ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లే ఆలోచన లేదని నాగార్జున మీడియా ముందే చెప్పేశారు.

Written By: Dharma, Updated On : September 21, 2023 9:41 am

Akkineni Nagarjuna

Follow us on

Akkineni Nagarjuna: హీరో అక్కినేని నాగార్జున వైసీపీలో చేరనున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి సేవలు అందించనున్నారా? జగన్ ఆయనకు కీలక పదవి ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీతో నాగార్జునకు మంచి సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ కు సినీ రంగంలో అత్యంత సన్నిహితుడిగా నాగార్జున మెలిగారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత నాగార్జున పార్టీలో చేరుతారని చాలాసార్లు ప్రచారం జరిగింది. కానీ ప్రత్యక్ష రాజకీయాలకు నాగార్జున దూరంగా ఉన్నారు. అయితే వైసీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పరోక్షంగా తన అభిమానులకు సంకేతాలు ఇచ్చేవారు.

గత ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి నాగార్జున పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తనకు ప్రత్యక్ష రాజకీయాల వైపు వెళ్లే ఆలోచన లేదని నాగార్జున మీడియా ముందే చెప్పేశారు. కానీ జగన్ సీఎం అయిన తర్వాత చాలా సార్లు తాడేపల్లి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. జగన్ జైల్లోనే ఉన్నప్పుడు ఆయనను నాగార్జున పరామర్శించారు. సినీ రంగం నుంచి అప్పట్లో తొలిసారిగా స్పందించిన వ్యక్తి కూడా ఆయనే. అప్పటినుంచి ఆయన రాజకీయ అరంగెట్రం పై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. కానీ రాజకీయాల్లోకి వచ్చేందుకు నాగార్జున ఆసక్తి చూపలేదు.

వైసిపి ఆవిర్భావం నుంచి విజయవాడ పార్లమెంటు స్థానం ఆ పార్టీకి దక్కలేదు. సరైన అభ్యర్థి లేకపోవడంతోనే ఓటమి ఎదురవుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గంతో పాటు చరిష్మ ఉండే నాయకుడు బరిలో దిగితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని జగన్ భావిస్తున్నారు. అందుకు నాగార్జున సరైన వ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆయనకు ఎంపీ అభ్యర్థిగా బరిలో నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే తనకు ప్రత్యక్ష రాజకీయాల సూట్ కావని నాగార్జున చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయంగా నాగార్జున సేవలు వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

జగన్ సర్కార్ చర్యల పుణ్యమా అని సినీ పరిశ్రమ వైసీపీకి దూరమైంది. అదే సమయంలో పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అటు కమ్మ సామాజిక వర్గం సైతం దాదాపు వైసీపీకి దూరమైనట్టే. ఈ తరుణంలో నాగార్జునను దగ్గరకు తీసుకుంటే.. అటు సినీ పరిశ్రమ, ఇటు కమ్మ సామాజిక వర్గం కొంతవరకు దగ్గరవుతాయని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే నాగార్జునకు రాజ్యసభ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో ప్రయోజనకరంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఒకవేళ నాగార్జున ఆమోదముద్ర వేస్తే రాజ్యసభ ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.