https://oktelugu.com/

CM Jagan: ఆ ముగ్గురికి రాజ్యసభ పదవులు.. రేసులో ‘అలీ’.. జగన్ కీలక నిర్ణయం?

ఏపీకి సంబంధించి ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసిపి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిడిపి నుంచి కనకమేడల రవీంద్రబాబు, బిజెపి నుంచి సీఎం రమేష్ పదవీకాలం ముగియనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 27, 2023 / 01:53 PM IST

    CM Jagan

    Follow us on

    CM Jagan: ఎన్నికల ముంగిట వైసీపీకి మరో అరుదైన అవకాశం. మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీ నుంచి ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏప్రిల్ లో దేశవ్యాప్తంగా 55 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీకి చెందిన బిజెపి నేత జివిఎల్ నరసింహారావు పదవీకాలం ఏప్రిల్ తో ముగియనుంది. తెలంగాణలో మూడు సీట్లు ఖాళీ అవుతాయి. అందులో రెండు కాంగ్రెస్ కు, ఒకటి బీఆర్ఎస్ కు దక్కే అవకాశాలు ఉన్నాయి.

    ఏపీకి సంబంధించి ముగ్గురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైసిపి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిడిపి నుంచి కనకమేడల రవీంద్రబాబు, బిజెపి నుంచి సీఎం రమేష్ పదవీకాలం ముగియనుంది. ఈ ముగ్గురు 2024, ఏప్రిల్ 2న పదవీ విరమణ చేయనున్నారు. వీటి భర్తీ కోసం మార్చిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఇది వైసీపీకి అనుకోని అవకాశం. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సమీకరణలతో భారీగా అభ్యర్థుల మార్పునకు జగన్ శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించనున్నారు. కొందరు సీనియర్లకు రాజ్యసభ తో పాటు నామినేటెడ్ పదవుల హామీ ఇవ్వనున్నారు. ఇంతలోనే ముగ్గురు రాజ్యసభ సభ్యుల భర్తీ చేసే అవకాశం రావడం మాత్రం ఆ పార్టీకి ప్లస్ గా మారింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు.

    వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. దీంతో ఎప్పటికీ నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి, బీదా మస్తాన్ రావు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. దీంతో ఈసారి నెల్లూరు జిల్లాకు చాన్స్ లేదు. అందుకే వేమిరెడ్డి స్థానంలో వైవి సుబ్బారెడ్డి కి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు బలమైన హామీ లభించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో వై వి సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పీఠాన్ని అందుకున్నారు. ఇటీవలే రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జిగా ఉన్నారు. వై వి కి రాజ్యసభ పంపించి.. ప్రకాశం జిల్లాలో ఉన్న వివాదాలను పరిష్కరించాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

    మరో రెండు స్థానాల్లో సామాజిక సమీకరణలకు పెద్దపీటవేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి మైనారిటీలకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే సినీ నటుడు అలీకి ఛాన్స్ దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఎస్టీలకు మరో స్థానం కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం లేదు. అందుకే రాజ్యసభ సీటు సర్దుబాటు చేసి ఎస్టీల్లో ప్రతికూలత రాకుండా చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజ్యసభలో వైసిపికి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు. తాజాగా ముగ్గురు ఎంపిక అయితే మాత్రం ఆ బలం 11కు చేరుకోనుంది. టిడిపికి మాత్రం ఉన్న ఒక్క సభ్యుడు పదవి విరమణ చేయడంతో.. కనీస ప్రాతినిధ్యం ఉండదు.