కరోనా వైరస్ కారణంగా ఈ నెల 26న జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల కమీషన్ ప్రకటించింది. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తామనేది మార్చి 31 తర్వాత వెల్లడిస్తామని వెల్లడించింది.
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 17 రాష్ట్రాలలో 55 రాజ్యసభ స్థానాలకు 26న ఎన్నికలు జరుగవలసి ఉంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం కూడా అప్రమత్తమైంది.
జన సమూహం లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్న క్రమంలో రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సిబ్బంది, రాజకీయ పార్టీల ఏజెంట్లు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జన సమూహం అధికంగా ఉంటుంది. ఆ సమూహంలో ఏ ఒక్కరికి వైరస్ ఉన్నా.. అది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.