Rajinikanth Vs YCP: మొన్న ఆ మధ్యన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించి గ్రాండ్ ఆడియో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో రజనీకాంత్ చేసిన కామెంట్స్ మరోసారి రాజకీయ దుమారం రేపాయి. ఏపీలోని వైసిపి నేతలను టార్గెట్ చేసుకొని రజనీ వ్యాఖ్యలు చేశారని టాక్ నడిచింది. అయితే అయితే దానిని అటు తిరిగి ఇటు తిరిగి పవన్ పై ఎగదోసేందుకు వైసిపి ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.
మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. అయినా మనం పట్టించుకోవద్దు.. ఇలాంటివి పట్టించుకోకుండా మన పని చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి.. అర్థమైందా రాజా? అంటూ రజినీ విరుచుకుపడ్డారు. అయితే ఈ కామెంట్స్ వైసీపీ నేతలు పైనేనని టాక్ నడిచింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రజనీకాంత్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రజిని తన స్నేహితుడు చంద్రబాబు పాలన ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఆ పాలన కావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా, కొడాలి నానితో పాటు వైసిపి కీలక నేతలు రజనీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైనే రజిని ఈ కామెంట్స్ చేశారని అందరూ అనుమానించారు. ముమ్మాటికీ అవి వైసీపీ నేతలకు ఉద్దేశించిన కామెంట్స్ అని భావించారు. టిడిపి సోషల్ మీడియా సైతం పెద్ద ఎత్తున ట్రోల్ చేసింది.
అయితే వైసిపి ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో… రజనీకాంత్ పవన్ కు కౌంటర్ ఇచ్చారని ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆ మధ్యన ఓ సినిమా వేదికపై.. తమిళంలో సైతం తెలుగు కళాకారులకు అవకాశాలు పెరగాలని… సినీ కళాకారులకు భాష, ప్రాంతీయ బేధాలు ఉండకూడదని పవన్ ఆకాంక్షించారు. ఈ విషయంలో తమిళ సినీ ఇండస్ట్రీ పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడా రజనీకాంత్ ను ఉద్దేశించి పవన్ మాట్లాడలేదు. అయితే వైసిపి మాత్రం పవన్ ఈ వ్యాఖ్యలు చేసినందుకే రజనీకాంత్ అలా కామెంట్ చేశారని ప్రచారం చేస్తోంది . సోషల్ మీడియాలో అదే వైరల్ చేస్తోంది. సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు కొట్టి పారేస్తున్నారు. అందులో వాస్తవం లేదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.రజని చేసింది ముమ్మాటికి వైసిపి నేతలను ఉద్దేశించి అని తేల్చి చెబుతున్నారు.
వైసీపీ నేతల దూకుడు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమ వైసీపీకి దూరమైందన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ తో నేరుగా కయ్యానికి దిగినట్లు వైసీపీ నేతలు ప్రవర్తించారు. దీనికి వచ్చే ఎన్నికల్లో మూల్యం తప్పదని భావిస్తున్నారు. ఏపీలో సైతం రజనీకాంత్ ఫాలోవర్స్ అధికం. వారంతా వైసీపీని వ్యతిరేకిస్తారు అన్న భయం వెంటాడుతోంది. అందుకే రజినీ వ్యాఖ్యలను పవన్ పై తోసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆ వ్యాఖ్యలు వైసీపీ నేతలను ఉద్దేశించి చేశారని ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా వైసిపి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ అయిన పరిస్థితులు కనిపించడం లేదు.