Rajinikanth Governorship: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త ప్రయాణం మొదలు పెట్టనున్నారా? సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? గవర్నర్ గా రాజ్ భవన్ లో అడుగు పెట్టనున్నారా? ఇప్పుడిదే తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక బీజేపీ భారీ వ్యూహం ఉందన్న టాక్ నడుస్తోంది. రజనీకాంత్ రాజకీయ ఎంట్రీపై దశాబ్ద కాలంగా రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ ప్రకటించారు కూడా. వరుసగా అభిమానులతో సమావేశమై వారితో చర్చలు కూడా జరిపారు. తరువాత ఎందుకో సైలెంట్ అయ్యారు. తనకు రాజకీయాలు సూటుకావని తెల్చేశారు. తాను రాజకీయాల్లోకి రావట్లేదని కూడా మరోసారి ప్రకటించారు. తరువాత బీజేపీ ఆయన్ను రంగంలోకి దించాలని ప్రయత్నించినా సుతిమెత్తగా తిరస్కరించారు. కానీ ప్రధాని మోదీతో మాత్రం తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ చెన్నై వచ్చినప్పుడు నేరుగా రజనీకాంత్ ఇంటికి వెళ్లిన సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నపలంగా రజనీకాంత్ పేరు గవర్నర్ గా తెరపైకి రావడం మాత్రం చర్చనీయాంశంగా మారుతోంది.
దక్షిణాది రాష్ట్రాలపై పట్టుకు..
ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఉంది. కానీ దక్షిణాధి రాష్ట్రాల్లో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. ఒక్క కర్ణాటకలో తప్పించి ఇంకెక్కడా అధికారంలోకి రాలేకపోతోంది. ఇప్పుడిప్పుడే తెలంగాణపై ఫోకస్ పెంచింది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని ప్రయత్నాలు చేస్తోంది. అటు తరువాత తమిళనాడుపై దృష్టి పెట్టింది. ప్రాంతీయ పార్టీల బలమైన ముద్ర ఉన్న తమిళనాడులో పాగా వేయడం అంత సులువు కాదని బీజేపీ పెద్దలకు తెలుసు. అందుకే అక్కడ క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తే తప్ప బలపడలేమని భావిస్తోంది. అందుకే అన్నా డీఎంకే పార్టీని తొలుత చెప్పుచేతల్లోకి తీసుకుంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు వ్యూహం పన్నుతోంది. అందుకే చరిష్మా కలిగిన రజనీకాంత్ సేవలను వినియోగించుకోవాలని చూస్తోంది. కానీ ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడడం లేదు. అందుకే గవర్నర్ పీఠం పై కూర్చోబెట్టి..ఆయన అభిమానుల ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ పదవి కట్టబెట్టింది.
Also Read: Sudheer Anasuya: ఈటీవీలోకి మళ్లీ సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ ఎంట్రీ! అసలేమైంది?
ఆ సమావేశాలు దేనికి సంకేతం?
అయితే ఇటీవల రజనీకాంత్ వ్యవహార శైలి చూస్తే ఏదో జరుగుతుందన్న అనుమానం అయితే తమిళనాట ఉంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు రజనీకాంత్ హాజరయ్యారు. అక్కడ ఆయనకు కేంద్ర పెద్దల నుంచి ప్రత్యేక ఆతిథ్యం లభించింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. కీలక చర్చలు జరిపారు. ఆయన ఎందుకు చర్చలు జరిపారో తెలియదు కానీ.. అదంతా గవర్నర్ గిరి కోసమేనన్న ప్రచారం అయితే సాగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ఆయన తమిళనాడు గవర్నర్ ఆర్ఎస్ రవితో సమావేశం కావడం అనుమానాలకు మరింత బలం చేకూరింది.
ఎంపీ సీట్లపై గురి
ఈ కీలక పరిణామాల నేపథ్యంలో అటు రజనీకాంత్ మీడియాతో మాట్లాడిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ తో ఏం చర్చించారని విలేఖర్లు అడుగగా.. రాజకీయాల గురించేనంటూ రజనీకాంత్ చెప్పారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ తో రాజకీయాలు చర్చించడమేమిటని విపక్షాలు రజనీకాంత్ పై విమర్శలు గుప్పించాయి. వాస్తవానికి ఏపిసోడ్ వెనుక బీజేపీ స్కెచ్ ఉంది. తమిళనాడులో బలపడాలన్న కోరికతో పాటు 2024 ఎన్నికల్లో రాష్ట్రం నుంచి వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానలను గెలుపొందాలన్నది బీజేపీ భావన. అందుకు రజనీకాంత్ చరిష్మా పనికొస్తుందని భావిస్తోంది.