టీఆర్ఎస్ తో 19 ఏళ్ల బంధాన్ని ఈటల రాజేందర్ తెంచుకున్నారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ జెండా మోసి జైలుకెళ్లి, అధికారంలోకి వచ్చాక మంత్రి అయ్యి ఇన్నేళ్లపాటుకొనసాగిన ఈటల రాజేందర్ అధికారికంగా టీఆర్ఎస్ కు ఈరోజు రాజీనామా చేసేశారు.
19 ఏళ్ల అనుబంధానికి.. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఈటల రాజేందర్ ప్రకటించారు. హైదరాబాద్ శివారు శామీర్ పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ ఉద్యమకాలంలో ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణిచివేతను నమ్ముకున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ కాదు అని.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పానని ఈటల మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించవచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పానని ఈటల అన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఎన్నో సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ఈటల గుర్తు చేసుకున్నారు. గతంలో 17 మంది రాజీనామా చేస్తే కేవలం ఏడుగురు మాత్రమే గెలిచారన్నారు. టీఆర్ఎస్ నుంచి ఎన్ని సార్లు బీఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పుకొచ్చారు.
నన్ను బొందపెట్టమని ఆదేశాలు అందుకున్న మంత్రి హరీష్ రావుకు అవమానం జరిగిందని..సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ బీసీ అధికారి ఉన్నారా? అని ఈటల ప్రశ్నించారు. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థిక మంత్రి ఉండరని.. టీఎన్టీజీవోలకు అనుమతి ఇవ్వలేదని ఈటల విమర్శించారు.
అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో నన్ను అవహేళన చేశారని.. పట్టుమని పదిసీట్లు గెలవలేదని విమర్శించారని.. అన్నీ భరించానని ఈటల తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండా ఉద్యమకారులను కరీంనగర్ ప్రజలు గెలిపించారని అన్నారు. టీఆర్ఎస్ ఎన్నిసార్లు బీఫాం ఇచ్చినా తాను గెలిచానని ఈటల అన్నారు.
ఇక తన బీజేపీలో చేరే విషయంపై మాత్రం ఈటల రాజేందర్ క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.