Raja Reddy Marriage: పిసిసి అధ్యక్షురాలు షర్మిల కుమారుడి వివాహ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 17న అట్లూరి ప్రియతో వైఎస్ రాజారెడ్డి వివాహం జరగనుంది. ఇందుకు రాజస్థాన్ లోని జోద్పూర్ లో ఉన్న ఉమైద్ భవన్ ముస్తాబైంది. బుధవారం సాయంత్రం షర్మిలా రెడ్డి కుటుంబ సమేతంగా జోద్ పూర్ ప్యాలెస్ కు చేరుకున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వివాహ వేడుకలకు హాజరు కానున్నారు. గత నెలలో నిర్వహించిన నిశ్చితార్థ వేడుకలకు ఏపీ సీఎం జగన్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం వివాహ వేడుకల ఏర్పాట్లలో షర్మిల బిజీగా ఉన్నారు. ఈనెల 16 నుంచి 18 వరకు వివాహ వేడుకలు కొనసాగను న్నాయి. 16న సంగీత్ తో పాటు మెహేంది కార్యక్రమం ఉంటుంది. 17న వివాహం జరగనుంది. 18న ఉదయం 11 గంటలకు నూతన వధూవరులతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. సాయంత్రం ఏడు గంటలకు తలంబ్రాల వేడుక ఉంటుంది. ఇప్పటికే వైఎస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున జోద్పూర్ ప్యాలెస్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వివాహానికి జగన్ హాజరవుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మేనమామ హోదాలో నిశ్చితార్థ వేడుకలకు సతీ సమేతంగా జగన్ హాజరయ్యారు. అయితేసోదరుడు జగన్ తో షర్మిలకు గ్యాప్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ఇద్దరూ పెద్దగా కలవలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే నిశ్చితార్థ సమయానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ పగ్గాలు అందుకోలేదు. బాధ్యతలు తీసుకున్నాక వైసిపి తో పాటు జగన్ పై షర్మిల వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులకు షర్మిల టార్గెట్ అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ వివాహ వేడుకలకు హాజరయ్యే ఛాన్స్ లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు వివాహ వేడుకలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ నుంచి చంద్రబాబుతో పాటు పవన్ సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది.