YS Sharmila: మనం మాట్లాడే మాటే మన గౌరవాన్ని పెంచుతుంది. పదిమందిలో మనకు ఒక స్థాయిని నిర్దేశిస్తుంది. అలాగని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ముందు ఇబ్బంది వస్తుంది. ఆ తర్వాత ఎదుటివారికి చులకన భావం కలుగుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే వైఎస్ షర్మిల ఎదుర్కొంటున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించే ముందు ఆమె తన రాజకీయ అదృష్టాన్ని తెలంగాణలో పరీక్షించుకున్నారు. తెలంగాణ కోడలుగా తనను తాను పరిచయం చేసుకున్నారు. తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పాదయాత్ర చేశారు. పాదయాత్ర సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మీద విమర్శలు చేశారు. కొన్నిసార్లు లైన్ దాటి మాట్లాడారు. అప్పట్లో తెలంగాణ పోలీసులు ఆమె యాత్రకు అడ్డంకులు కల్పించారు. కోర్టు ద్వారా ఆమె అనుమతులు తెచ్చుకున్నప్పటికీ భారత రాష్ట్ర సమితి నాయకులు నిరసన తెలిపారు..
ఇవన్నీ జరుగుతుండగానే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. కానీ అనూహ్యంగా షర్మిల ఎన్నికల నుంచి తప్పుకుంది. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నామని ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. అప్పటిదాకా తెలంగాణ కోడలుగా ఇక్కడ రాజకీయాలు చేసిన షర్మిల.. ఒక్కసారిగా ఏపీకి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించింది. తెలంగాణలో గతంలో చేసినట్టుగానే.. అక్కడి ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది. అక్కడి ముఖ్యమంత్రి తన అన్న జగన్ మోహన్ రెడ్డి అని కూడా చూడకుండా విమర్శల బాణాలు ఎక్కిపెడుతోంది. ఇదంతా జరుగుతుండగానే షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. అలా జరగడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని షర్మిల ఆరోపించారు. ప్రధానిని విమర్శించే క్రమంలో మోడీ గారు అనబోయి మోడీ *డు అన్నారు. దీంతో ఒకసారి పక్కనున్న నాయకుడు తనలో తానే నవ్వుకున్నారు. వెంటనే సముదాయించుకున్న షర్మిల తర్వాత మోడీ గారు అని సంబోధించారు. షర్మిల మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎంత మాటనేశావు షర్మిలక్కా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక బిజెపి నాయకులు షర్మిల వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రిని ఎలా గౌరవించాలో కూడా తెలియని ఈమె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎలా అయిందని ప్రశ్నిస్తున్నారు.
View this post on Instagram