Congress : తెలంగాణపై రాహుల్ గాంధీ ఫుల్ ఫోకస్ పెట్టారు. కర్ణాటక తర్వాత గెలుపు అవకాశాలు ఉన్న తెలంగాణలో వచ్చేసారి అధికారంలోకి రావడమే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న భట్టిని ప్రోత్సహిస్తున్నారు. ఈ నెల 15న భట్టి జన్మదినం సందర్భంగా స్వయంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసి విషెస్ చెప్పారు. పాదయాత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతున్న తీరును అభినందించారు. పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని రాహుల్ హామీ ఇచ్చారు.
భట్టి పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు పర్యటించటం.. భట్టికి స్థానికులు ఫిర్యాదు చేసిన అంశాల పరిష్కారానికి చొరవ తీసుకోవటం ద్వారా భట్టి యాత్ర ఆ పార్టీలో ఎంత కలవరపాటుకు గురి చేస్తుందనేది స్పష్టం అవుతోంది. పాదయాత్ర సమయంలోనే పార్టీలో నేతల చేరికల పైన భట్టి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పొంగులేటి వంటి నేతలు భట్టిని కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు. జూలై 2న ఖమ్మంలో జరిగే సభకు రాహుల్ హాజరు కానున్నారు. ధృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్న భట్టి విక్రమార్క పాదయాత్ర ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు స్పూర్తిగా మారుతోంది.
రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర కొనసాగిస్తున్నారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జూలై 2న ముగియనుంది. ఖమ్మంలో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ హాజరు కనున్నారు. భట్టి యాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ పెరిగింది. ఈ వేదిక అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలు ఒక్కటయ్యారు. వీరందరినీ భట్టి పాదయాత్ర ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది.
పొంగులేటి కూడా గతంలో జరిగిన వన్నీ మర్చిపోయి నల్లగొండ జిల్లాలో భట్టి చేస్తున్న పాదయాత్ర దగ్గరకు వెళ్లారు. భట్టితో మాట్లాడారు. తర్వాత ఇద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతామని ప్రతిజ్ఞ చేశారు. ఇలా కాంగ్రెస్ లో ఐక్యత తీసుకొస్తున్న మన భట్టి విక్రమార్క ఖమ్మంలో అసమ్మతి లేకుండా చేస్తున్నాడు. పార్టీని ముందుండి నడిపిస్తున్నారు.