రాహుల్ ప్లాన్‌ అదేనట.. అందుకే ఇంత ప్రయాస

  దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎదురీదుతోంది. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ.. ఆ పార్టీ నుంచి ఒక్క రాహుల్‌ గాంధీనే ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు. సీనియర్‌‌ నేతలందరినీ ప్రచారానికి దూరంగా పెట్టడంతో రాహుల్ గాంధీనే అంతా తానై నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ […]

Written By: Srinivas, Updated On : April 10, 2021 9:16 am
Follow us on

 

దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఎదురీదుతోంది. ఇప్పటికే దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ.. ఆ పార్టీ నుంచి ఒక్క రాహుల్‌ గాంధీనే ఒంటరి పోరాటం కొనసాగిస్తున్నారు. సీనియర్‌‌ నేతలందరినీ ప్రచారానికి దూరంగా పెట్టడంతో రాహుల్ గాంధీనే అంతా తానై నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ అటు కేరళ, ఇటు అసోంలపైనే ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఆ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు.

తమిళనాడులో ఎలాగూ డీఎంకే కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల్లో మూడింటినైనా చేజిక్కించుకుని కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తేవాలని రాహుల్ గాంధీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. ఆయన 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ విన్పిస్తున్నా ఆయన అయిష్టంగానే ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏఐసీసీ సమావేశాలు నిర్వహించి దీనిపై రాహుల్ గాంధీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకోసమే ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఆయన విస్తృతంగా పాల్గొంటున్నారని టాక్‌.

సీనియర్ నేతల నోళ్లు మూయించాలంటే కాంగ్రెస్ ఈ ఐదు రాష్ట్రాల్లో తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. కనీసం మూడు రాష్ట్రాల్లోనైనా ప్రతిభ కనబరిస్తే సీనియర్ నేతలందరూ దారిలోకి వస్తారు. దాదాపు 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధిష్టానంపై తరచూ ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే.. వారందరి నోళ్లకు బ్రేకులు పడాలంటే ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలుపొందాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకే.. రాహుల్‌ తన శక్తికి మించి కష్టపడుతున్నారని ప్రచారం నడుస్తోంది.

భవిష్యత్తులో సీనియర్లందరినీ పక్కన పెట్టి పార్టీలో యువతకు పదవులు ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ ప్లాన్‌. అందుకోసమే రాహుల్ గాంధీ ఈ ఎన్నికల కోసం శ్రమిస్తున్నారు. సక్సెస్ అయితే రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిని వెంటనే చేపట్టే అవకాశముంది. అలాగే తన టీంకు పదవులు అప్పగించనున్నారు. ఏఐసీసీ, సీడబ్ల్యూసీలను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీదనే కాంగ్రెస్‌ భవిష్యత్ అంతా ఆధారపడి ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు.