
మూడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించాడు పవర్ స్టార్. దీంతో.. అభిమానుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. పవన్ ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై చాలా ఆసక్తిని ప్రదర్శించారు. అభిమానులు ఆశించినట్టుగానే సినిమాకు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యునానిమస్ గా అన్ని వర్గాల నుంచీ పాజిటివ్ టాక్ రావడంతో.. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాడు వకీల్ సాబ్.
సిల్వర్ స్క్రీన్ మొత్తాన్ని గ్రాబ్ చేసిన పవర్ స్టార్.. వకీల్ సాబ్ గా విశ్వరూపం ప్రదర్శించాడని అంటున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ నటన ఎవరెస్టుపై ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రధానంగా కోర్టు సీన్లు దద్దరిల్లిపోయాయని చెబుతున్నారు. సినిమాను పవన్ కంప్లీట్ గా ఓన్ చేసుకున్నారని, పవర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటిగా మిగిలిపోతుందని చెబుతున్నారు.
ఆకాశంలో ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు మేకర్స్. హైదరాబాద్ లో మొత్తం 400 ఆటలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖలో 65, ఒంగోలులో 25, గుంటూరులో 51, కడపలో 24.. ఇలా భారీ స్థాయిలో వకీల్ సాబ్ ను ప్రదర్శించేందుకు సిద్ధం చేశారు. బి, సి, సెంటర్లలోనూ వకీల్ సాబ్ దుమ్ములేపుతున్నాడు.
మూడేళ్లుగా ఆకలితో ఉన్న ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాకోసం ఎగబడ్డారు. దాదాపు అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేశారు. దీంతో.. తొలిరోజున 5.50 కోట్లు వసూళ్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ తొలిరోజు రికార్డు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ పేరిట ఉంది. ఈ చితరం రూ.4.39 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును వకీల్ సాబ్ తిరగరాయబోతున్నాడని అంటున్నారు.
అటు, ఫారెన్ లోనూ వకీల్ సాబ్ దుమ్ములేపుతున్నాడు. అమెరికాలో సమారు 226 లొకేషన్లలో రిలీజైన ఈ చిత్రం తొలి రోజున 364కే డాలర్లను వసూలు చేసినట్టు తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ ప్రీమియర్ గా రికార్డు నమోదు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోనూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఆసీస్ లో 1.45లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు, న్యూజీలాండ్ లో 8,302 కివీస్‌డాలర్లు రాబట్టింది. ఈ విధంగా.. తొలిరోజే 32 కోట్ల షేర్ ను రాబట్టి, టాలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబోతోందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అయితే.. ఈ సినిమా మొదటి రోజే ఆన్ లైన్లోకి వచ్చేసింది. మూవీ రూల్జ్ సహా పలు సైట్లు థియేటర్ ప్రింట్ ను తమ సైట్లో పోస్టు చేశాయి. థియేటర్ కు వెళ్లి చూడలేని వారు ఈ సైట్లను ఆశ్రయించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే జరిగితే.. వకీల్ సాబ్ కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. మరి, ఏం జరుగుతుంది..? అన్నది చూడాలి.