
Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో అధికారమే లక్ష్యంగా పార్టీ ముందుకు వెళుతోంది. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగేందుకు సమ్మతించారు. దీంతో పార్టీ మళ్లీ గాడిన పడుతుందని ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. త్వరలో జరిగే అయిదే స్టేట్ల ఎన్నికల్లో పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోయేందుకు పలు మార్గాలు అన్వేషిస్తోంది.
శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కాలంలో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని పలువురు సీనియర్ నేతలు కోరడంతో ఆయన సరే అన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో అధికారంలో కూర్చోబెట్టేందుకు పలు కీలక వ్యూహాలు ఖరారు చేయనుంది.
మరోవైపు జీ23 నేతలపై సోనియాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. పార్టీ కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పార్టీలో అసంతృప్తులను బుజ్జగించే పని ఉండదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలను కాపాడే విధంగా అందరు కలిసి రావాలని సూచించారు. పార్టీ బలోపేతమే ధ్యేయంగా ముందుకు సాగాలని నిర్ణయించారు. ఎవరు కూడా సొంత నిర్ణయాలతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం కారణంగా అధ్యక్ష ఎన్నికకు గడువు పొడిగించినట్లు తెలుస్తోంది.