Rahul Gandhi Meets Voters: శీర్షిక చదవగానే కాంగ్రెస్ నాయకులకు, రాహుల్ అభిమానులకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొందరికి కోపం కూడా వస్తుంది.. కానీ తొందర పడకండి.. ఇది మేం చెప్పిన విషయం కాదు.. స్వయంగా రాహుల్‌గాంధీనే చెప్పారు చనిపోయివారితో చాయ్ తాగానని. కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో ఓటరు జాబితా ప్రక్షాళన చేపట్టింది. ఇందులో కొందరు చనిపోయారని వారి పేర్లు తొలగించింది. ఈ జాబితాలో ఉన్న కొందరిని రాహుల్‌గాంధీ ఢిల్లీకి పిలిపించుకుని వారితోకలిసి చాయ్ తాగారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల సంఘం, బీజేపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాల ఓటు హక్కును అడ్డుకునే కుట్రలో భాగంగా లక్షలాది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు రాజకీయ చర్చనీయాంశంగా మారింది.
ఓటరు జాబితాలో అవకతవకలు..
రాహుల్ గాంధీ ఆరోపణలు ఓటరు జాబితాల నిర్వహణలో తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయి. ‘చనిపోయినవారు’గా గుర్తించబడిన వ్యక్తులు బతికే ఉండటం ఎన్నికల సంఘం డేటా సేకరణ, ధ్రువీకరణ ప్రక్రియలలో లోపాలను బహిర్గతం చేస్తుంది. ఇది కేవలం సాంకేతిక లోపమా లేక రాజకీయ లబ్ధి కోసం చేసిన ఉద్దేశపూర్వక చర్యనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బిహార్ వంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఓటరు జాబితాల నుంచి పేర్ల తొలగింపు వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తనకు అవకాశంగా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఓటర్ల తొలగింపు బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి చేసిన కుట్రగా వర్ణించడం రాజకీయంగా సునిశితమైన వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీపై దళిత, వెనుకబడిన వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఓటు హక్కును హరించే ప్రయత్నంగా చిత్రీకరించడం ద్వారా ఈ వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతును సంపాదించే అవకాశం ఉంది. ఇక ఈ ఆరోపణలు ఎన్నికల సంఘం స్వాతంత్య్రం, నిష్పక్షపాతంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తిరస్కరించి, ఓటరు జాబితాలను శుద్ధి చేయడం రొటీన్ ప్రక్రియగా వాదించవచ్చు, కానీ ఈ వివాదం సంస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది.
Also Read: వీధి కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయి.. సెలబ్రెటీస్ ఎందుకంత ఏడుపు?
ప్రమాదంలో దళిత, వెనుకబడిన వర్గాల ఓటు హక్కు..
ఓటరు జాబితా నుంచి లక్షలాది పేర్ల తొలగింపు దళిత, వెనుకబడిన వర్గాల ఓటర్లను అసమానంగా ప్రభావితం చేస్తుందని రాహుల్ గాంధీ వాదన ఆందోళన కలిగిస్తోంది. ఈ వర్గాలు చారిత్రాత్మకంగా సామాజిక, ఆర్థిక ఆటంకాలను ఎదుర్కొంటున్నాయి. జాబితాలో అవకతవకలు ఈ వర్గాల ప్రాతినిధ్యాన్ని మరింత బలహీనం చేస్తాయి. ఈ విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం అవసరం.