Rahul Gandhi : విశాఖ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తోంది. ఏపీలో సైతం పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కనీసం ఉనికి చాటాలని.. ఓట్ల శాతం పెంచుకోవాలని బలమైన నిర్ణయంతో ఉంది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. చాలామంది వైసిపి నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. వారి చేరికతో ఒక ఊపు వస్తుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇటువంటి తరుణంలో విభజన హామీలపై స్పష్టమైన ప్రకటనలు చేస్తే వర్కౌట్ అవుతుందని అంచనా వేస్తోంది. అందుకే రాహుల్ గాంధీ ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో ప్రత్యేక లైన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని.. తద్వారా పార్టీ ఎదుగుదలకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేసినట్లు తెలుస్తోంది. అటు విశాఖ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే గెలుపొందడం సునాయాసమని భావిస్తున్నట్లు సమాచారం.
రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేధి సొంత నియోజకవర్గంగా ఉండేది. రాహుల్ గాంధీ ఎప్పుడూ అక్కడి నుంచే పోటీ చేసేవారు. కానీ గత ఎన్నికల్లో అమేధితో పాటు కేరళలోని వయానాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఒకచోట మాత్రమే గెలిచారు. ఈసారి కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని రాహుల్ భావిస్తున్నారు. విశాఖ అయితే సేఫ్ జోన్ గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు రాహుల్ గాంధీ సిద్ధపడుతున్నారు. అటు తన పాదయాత్ర ప్రారంభించక ముందే విశాఖ వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి ఒక ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది.