
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమంటే ఇదే. అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మునిగిపోయే నౌక అనే పరిస్థితికి వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ లో ఉండడానికి ఎవరు ఇష్టపడడం లేదు. దీంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొత్త పల్లవి అందుకుంటున్నారు. ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టి పోయిన నాయకులను వెనక్కి తీసుకురావాలని భావిస్తున్నారు. ఉద్దేశం మంచిదే అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలోకి తిరిగి వచ్చేందుకు ఎవరు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అయినా అధినేత చెప్పినందున చేసి తీరాలని నేతలు భావిస్తున్నా అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ నేతలో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితిపై బాధ పడ్డారు. పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కానీ ఇది చెప్పినంత ఈజీ కాదని తెలుస్తోంది. ఏటిలో దిగిన వాడికి తెలుస్తుంది లోతెంత అనేది గట్టు మీద ఉన్న వాడికి ఏం తెలుస్తుంది అని నేతలు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా ఇదే చెప్పారు. కానీ ఆచరణలో సాధ్యం కాలేదు. దీంతో ఆయన మౌనముద్ర వహించారు.
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చాలా మంది జంపు జలానీలు ఉన్నారు. కాంగ్రెస్ లో భవిష్యత్ లేనది తెలుసుకుని పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరి ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ రమ్మంటే ఎందుకు వస్తారని పార్టీనేతలే చెబుతున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో నిజం ఉన్నా కూడా అది సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితిలో ఘర్ వాపసీ సాధ్యం కాదు. ఇదేవిషయాన్ని నేతలు చెబుతున్నారు. పార్టీని గాడిలో పెట్టాలంటే బలమైన నాయకత్వం ఉండాలని సూచిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ ను ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు ఎవరు కూడా చూడడంలేదు. ప్రజల దృష్టిలో కాంగ్రెస్ విలన్ గా మారిపోయింది. ముందు ఈ మచ్చను తుడిచేయగలిగితేనే భవిష్యత్ ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయం గురించి పట్టించుకోకుండా మిగతా వాటికి ఓటు వేసినంత మాత్రాన పరిస్థితి మారదని అంటున్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.