
తనను విచారణ సమయంలో పోలీసులు కొట్టారని ఫొటోలు విడుదల చేసి రచ్చ చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజుది అంతా డ్రామా అని తేలింది. రఘురామ రాజు రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారింది కానీ.. బయటకి గాయాలు కనిపించలేదని డాక్టర్లు తమ మెడికల్ రిపోర్టులో పేర్కొన్నారు.
ఎంపీ రఘురామకు సంబంధించిన మెడికల్ రిపోర్టును పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది.
రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని.. రెండు పాదాలకు , అరికాలుకు రంగు మారిందని.. కానీ బయటికి గాయాలు కనిపించలేదని రిపోర్టులో పేర్కొన్నారు.
ఇక రఘురామకు గుండెనొప్పి ఉందని ఫిర్యాదు చేశారని.. నాలుగున్నర నెలల క్రితం గుండెకు శస్త్రచికిత్స జరిగిందని.. వెంటనే కార్డియాలజిస్ట్ కు పంపామని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎంపీ రఘురామ ఆరోగ్యం, గుండె నిలకడగా ఉందని వైద్యులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. నెఫ్రాలజిస్ట్ దగ్గరకు కూడా పంపామని.. నార్మల్ గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.
దీన్ని బట్టి రఘురామను పోలీసులు కొట్టారని.. కాలు వాచాయన్నది అబద్దమని మెడికల్ రిపోర్ట్ తేల్చింది.
కాగా తన భర్తకు ప్రాణాహాని ఉందని.. ఎంపీ రఘురామకృష్ణంరాజు భార్య రమ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని కోర్టు చెప్పినా వినకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారని అన్నారు. తన భర్తకు ఏదీ జరిగినా దానికి ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఐడీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు.