
వైసీపీ పార్టీకి కొత్తగా శత్రువులు అవసరం లేదు. వైసీపీలోనే ఉంటూ ఆ పార్టీపై విమర్శలు చేస్తూ రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్ కు సృష్టిస్తున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. సొంత పార్టీ ఎంపీ కావడంతో కొందరు వైసీపీ నేతలు సైతం ఆయన విషయంలో సంయమనంగా వ్యవహరిస్తున్నారు. మరి కొందరు నేతలు మాత్రం రఘురామతో వాదించి తమ పరువు పోగొట్టుకోవడం ఎందుకని సైలెంట్ అవుతున్నారు.
తాజాగా మరోమారు మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణంరాజు జగన్ సర్కార్ పై, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఢిల్లీ పర్యటన ఆయన వ్యక్తిగతమని.. జగన్ ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాతో నిధుల గురించి మాట్లాడాడని తెలిసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని పేర్కొన్నారు. వైసీపీ నేతల ప్రవర్తన ఉన్మాదులు ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా ఉందని.. జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమలలో అడుగు పెట్టాలని కోరారు.
సీఎం జగన్ రాష్ట్రంలో తెలుగును భూస్థాపితం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. వైసీపీ తన రక్తం తాగిందని తన రక్తం తిరిగి ఇస్తుందా..? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని.. తనకు సెక్యూరిటీని తొలగిస్తారని చెబుతున్నారని.. కానీ వాళ్లు ఇదే విధంగా మాట్లాడితే తన సెక్యూరిటీ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.
కొందరు నేతలు తన బాగోతాలను బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తాను కూడా అవతలి వ్యక్తుల బాగోతాలను బయట పెట్టగలనని హెచ్చరించారు. స్వరూపానంద సీఎం జగన్ కు హితోపదేశ చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. జగన్ హిందువులకు కక్షకుడిగా మారాడని చెప్పారు. జగన్ అమిత్ షాతో పావుగంట మాత్రమే మాట్లాడారని.. జగన్ జడ్జీలకు, న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు.